మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు
మంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): సోమవారం అసెంబ్లీ ముందు జరిగిన ఘటనకు సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలని మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు. లకారంలో స్పీకర్‌ను దూషించి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో సీతక్క మాట్లాడుతూ... మహిళా ఎమ్మెల్యే లను ముందు పెట్టుకుని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాల ని విజ్ఞప్తి చేశారు.
పొట్టకూటి కోసమో, లేక ప్యాషన్‌తోనే మహిళలు పోలీసులు అయితే.. వారిపై చేతులు వేసి అవమాన పరిచారని ఆరోపిం చారు. మహిళా పోలీసుల మీద కేటీఆర్ చేతులు వేశారని, కావాలంటే విజువల్స్ సభకు సమర్పిస్తానని వెల్లడించారు. మహిళా పోలీసుల మీద చేతులు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో రభస దేనికని ప్రశ్నించారు. సొంత ఇంటి ఆడబిడ్డ కవితను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారని, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
స్పీకర్‌ను అవమానిస్తే సహించం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
స్పీకర్‌ను అవమానిస్తే సహించబోమని, ప్రతిపక్ష నేతలు ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(Minister Adluri Laxman Kumar) డిమాండ్ చేశారు. స్పీకర్‌ను అవమానించిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్కు పశ్చాత్తాపమే లేదన్నారు. తాతా మధు వ్యాఖ్యలపై హరీశ్‌రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని అనుకున్నాం.. కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ... మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మికూడా సోదరీమణులే.. వారిపై దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు.
మహిళల అంశాన్ని అడ్డం పెట్టుకుని స్పీకర్ అవమానంపై రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. ముందు స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పోరాడిన వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ కావడం కొందరికి జీర్ణం కావడం లేదని విమర్శించారు. ఇది వ్యక్తిపై దాడి కాదు.. స్పీకర్ కుర్చీ గౌరవంపై జరిగిందని అభివర్ణించారు. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజకీయ పోరాటం చేయండి.. కానీ రాజ్యాంగ పదవులను అవమానించవద్దని సూచించారు. తప్పును తప్పు అనకుండా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం బీఆర్ఎస్కు తగదన్నారు.