12 June, 2026 | 1:21 AM

జేఎన్టీయూ పరిధిలో తగ్గనున్న ఇంజినీరింగ్ సీట్లు!

12-06-2026 12:00 AM
  1.   133 కాలేజీల్లో తనిఖీ, 89 చోట్ల సరిపడా అధ్యాపకులు లేరు
  2. ప్రిన్సిపాళ్లకు అర్హతలు, బయోమెట్రిక్‌లలో లోపాలు గుర్తింపు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): జేఎన్టీయూహెచ్ పరిధిలోని పలు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు తగ్గనున్నాయి. దాదాపు 12 కళాశాలల్లో సీట్లకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల యూనివర్సిటీ పరిధిలోని 133 కాలేజీల్లో తనిఖీ చేసిన అధికారుల బృందాలకు 89 కాలేజీల్లో సరిపడా అధ్యాపకులు లేకపోవడం, ప్రిన్సిపాళ్లకు అర్హతలు, బయోమెట్రిక్ లేకపోవడం లాంటి లోపాలను గుర్తించారు. దీనికనుగుణంగానే వర్సిటీ ఆయా కాలేజీలకు నోటీసులను జారీ చేసింది.

దీనిపై కాలేజీలు వర్సిటికీ వివరణలు పంపాయి. అప్పీలేట్ కమిటీ ఈ అంశంపై విచారణ జరపగా, దాదాపు 12 కాలేజీల్లో కొందరు అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరులేదని గుర్తించింది. ఈ క్రమంలోనే బ్రాంచీలు, సీట్లు తగ్గించాలని కమిటీ వర్సిటీకి సిఫార్సు చేసింది. దీంతో ఆ కాలేజీల్లో వెయ్యికిపైగా సీట్లు తగ్గే అవకాశముందని తెలిసింది. బ్రాంచీలు, సీట్లు తగ్గింపు అంశంపై వర్సిటీ వీసీ నిర్ణయమే ఫైనల్ కానుంది.