నస్పూర్ చెరువులో మట్టి దొంగలు
- పొలాలకు మట్టి తరలింపునకు రైతుల పేరిట అనుమతి
- తరలించేది ప్లాట్లకు, వెంచర్లకు...
- చెరువులో బావుల మాదిరిగా లోతైన తవ్వకాలు...
- కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకుల అండతోనే..?
- కండ్లు మూసుకొని కూర్చుంటున్న అధికారులు
మంచిర్యాల, జూన్ 15 (విజయక్రాంతి): మంచిర్యాల కలెక్టరేట్ సమీపాన గల నస్పూర్ చెరువులో మట్టి దొంగలు పడ్డట్టున్నారు. ఏకంగా చెరువుకు రెండు వైపులా మూడు జేసీబీలు పెట్టి వందల ట్రిప్పుల చెరువు మట్టి సమీప వెంచర్లకు, ప్లాట్లకు తరలిస్తున్నారు. నస్పూర్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకుల అండదండలతో మూడు జేసీబీలు, మూడు వందల ట్రిప్పుల ట్రాక్టర్ మట్టి చందంలా దందా జోరుగా సాగుతోంది.
ప్లాట్లకు, వెంచర్లకు వందల ట్రిప్పుల మట్టి...
నస్పూర్ మండలం సీతారాంపల్లి, నస్పూర్ గ్రామ రైతుల పేరిట కార్పోరేటరే స్వయంగా అనుమతులు తీసుకొని వెంచర్లకు, ప్లాట్లకు వందల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. మొరం లాంటి మట్టి కావడంతో జేసీబీలతో మనిషి మునిగేంత లోతు వరకు పూడిక తీస్తున్నారు. ప్రస్తుతం చెరువులో గమనిస్తే బావుల్లాంటి బొందలు దర్శనమిస్తున్నాయి. నిబంధనల మేరకు మీటరు, మీటరునరలోతు దాటవద్దని అధికారులు చెబుతున్నా.., గ్రౌండ్ మీదకు వెళితే బావులను తలపించే లోతైన బొందలే కనిపిస్తున్నాయి.
అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు కనీసం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం, రైతుకు ఉన్న వ్యవసాయ భూమి ఎంత ఉంది, ఎన్ని టన్నుల మట్టి అవసరముంటుందనేది అనుమతి పత్రాల్లో ఇవ్వకుండా పక్షం రోజులు, నెల రోజుల పాటు తరలించుకోవచ్చన్నట్లు అనుమతి ఇస్తుండటం విడ్డూరంగా ఉంది. బావుల మాదిరి లోతైన తవ్వకాలు చేస్తుండటంతో వర్షకాలం నీరు చేరితే ఆ బొందలు ఎన్ని మూగజీవాల, ఎంతమంది మనుషుల ప్రాణాలు మింగుతాయోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకుల అండతోనే..?
నస్పూర్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతోనే మట్టి మాఫియా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రతి రోజు పగలు, రాత్రి అనే తేడాలేకుండా వందల ట్రిప్పుల చెరువు మట్టి తరలుతుంటే సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. సీతారాంపల్లి గ్రామం, గ్రామ రోడ్లను, వెంచర్లను పరిశీలిస్తే టన్నుల కొద్ది మట్టి కుప్పలే దర్శనమిస్తున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు సోయికి వచ్చి అనుమతి తీసుకున్నది ఎవరు, మట్టి తరలిస్తుంది ఎక్కడికే ఆరాతీస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది. మరి దొంగలను దొరకపడతారా..? దొంగలిచ్చిన డబ్బులు జేబులు నింపుకొని కండ్లు మూసుకొని ఉంటారా..? చెరువు బొందలమయమైతుందని అసలైన రైతులు వాపోతున్నారు. కలెక్టర్ సారూ.. జర మా చెరువును మట్టి అక్రమార్కుల నుంచి కాపాడండి అటూ వేడుకుంటున్నారు.






