26-09-2024 12:00:00 AM
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది. మూడు నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో, నెల రోజులుగా న్యాయస్థానంలో కలకలం సృష్టించిన మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) అక్రమాల విషయంలో సిద్ధ రామయ్యను విచారించాలంటూ రాష్ట్ర గవర్నర్ గహ్లోత్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం దీనికి ప్రధాన కారణం.
దీంతో సీఎంగా ఆయన భవిష్యత్తు ఊగిసలాటలో పడింది. తాజాగా ఈ వ్యవహారంపై లోకాయుక్త విచారణకు ఆదేశిస్తూ బుధవారం ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. మూడు నెలల్లోగా ఈ స్కామ్‌పై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ఆయన విచారణను ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
‘ముడా’ కుంభకోణంలో తాను విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో తానేమీ భయపడడం లేదంటూ తాజా తీర్పుపై సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం మేకపోతు గాంభీర్యం మాత్రమేనని విపక్షాలు అంటున్నాయి. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తీరాలంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలు పెట్టింది.
హైకోర్టు తీర్పు వెలువడగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హుటాహుటిన బెంగళూరుకు చేరుకుని సిద్ధరామయ్యకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. కానీ ఆదినుంచి డోలాయమానంలో ఉన్న ఆయన పదవికి గండం తప్పదని గత కొద్ది నెలలుగా ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై పోరాటం చేస్తున్న బీజేపీ అంటోంది.
మైసూరు నగరాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి భార్య పార్వతినుంచి భూమి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె భూమి కోల్పోయిన ప్రాంతంలో కాకుండా మైసూరు నగరంలో అత్యంత ఖరీదయిన ప్రాంతంలో 14 ప్లాట్లను కేటాయించడం వివాదాస్పదమైంది. దీనిపై ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కు పిటిషన్ సమర్పించారు.
దీని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలియజేశారు.ముడా భూముల లావాదేవీల్లో సిద్ధరామయ్య ‘తెరవెనుక’ లేరని, ఆయన కుటుంబానికి సుమారు రూ.56 కోట్ల లబ్ధి చేకూరిందనే విషయాన్ని అంగీకరించకుండా ఉండడం కష్టమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న తన ఉత్తర్వులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి.
తాజాగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎఫ్‌ఐఆర్ దాఖలయితే నిష్పక్షపాత విచారణ కోసం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చించిన సిద్ధరామయ్య సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాలు చేయాలని అనుకొంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఆదినుంచి సిద్ధరామయ్య సీఎం కావడం గిట్టని కాంగ్రెస్‌లోని ఆయన వైరివర్గాలు సైతం ఇప్పుడు పదవినుంచి ఆయన తప్పుకోవాలని కోరుకుంటుండడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిని ఎంపిక చేసే విషయంలో కొన్నిరోజుల పాటు కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడిన విషయం తెలిసిందే. చివరికి సీఎం పదవికోసం పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మరో ముఖ్యనేత పరమేశ్వరను ఒప్పించి సిద్ధరామయ్యను ఆ పదవికోసం అధిష్ఠానం ఎంపిక చేసింది.
అయినప్పటికీ గత ఏడాది కాలంలో సీఎం పదవిపై కాంగ్రెస్ నేతలనుంచి అడపాదడపా వివాదాస్పద ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ఆ ప్రకటనలు వచ్చిన ప్రతిసారీ సీఎం మార్పు ఖాయమన్న వార్తలూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అసమ్మతి నేతలంతా కూడా సిద్ధరామయ్యకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సిద్ధరామయ్యకు భరోసా ఇచ్చింది. ఇన్ని జరిగినా కర్నాటకలో సిద్ధరామయ్య పదవినుంచి తప్పుకోవడం ఖాయమని కమలనాథులు గట్టి ధీమాతో ఉన్నారు.