28 April, 2026 | 3:03 AM

అవగాహనతోనే బాల్య వివాహాల నిర్మూలన

28-04-2026 01:15 AM

భీమారం (చెన్నూర్), ఏప్రిల్ 27: అవగాహనతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమవుతుందని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇంచార్జ్ ఎస్.ఐ. హైమ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో ‘షీ టీమ్స్’ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల భద్రత, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఎస్ ఐ మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు, పిల్లల భద్రతకు సంబంధించి పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700 కు సమాచారం అందించాలని సూచించారు.

ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, బాధితులు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికల వివాహాలు జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమారం గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ సత్తెమ్మ, ఫీల్ అసిస్టెంట్ బన్సీలాల్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.