28 June, 2026 | 1:53 AM

ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయండి

28-06-2026 12:50 AM

టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్ డిమాండ్                              

జవహర్‌నగర్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని టిపి టిఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఏ. విజయకుమార్ డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ గీతాంజలి హై స్కూల్ లో శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ సురేందర్ అధ్యక్షతన మేడ్చల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్ హాజరై మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి భరోసా కల్పించాల్సింది ఉంటుందని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ విద్యారంగానికి చేస్తున్న సేవలకు  గుర్తింపు లభించాలని టీచింగ్ స్టాఫ్ విద్యారంగంలో అడుగుపెట్టినప్పటి నుండి రిజిస్ట్రేషన్ చేసి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని హెల్త్ కార్డు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలలో ఈఎస్‌ఐ పిఎఫ్ తప్పక అమలు అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్స్ కు కనీస సౌకర్యాలు అయిన కూర్చోవడానికి చైర్స్, వాటర్ బాటిల్స్, వెయిటింగ్ రూమ్స్ లాంటివి తప్పక కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా నాయకులు మృత్యుంజయ, శ్రీహరి, గణేష్, మురళి, సంపత్, శైలజ, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.