ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత విధానంలోనే కొనసాగించాలి
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు వినతిపత్రం అందజేసిన గుజ్జ సత్యం
ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై వినతిపత్రం సమర్పించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో అమలైన పాత విధానంలోనే కొనసాగిస్తూ, పెండింగ్లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ కమిషన్ ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ ఉన్నత విద్య పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల హక్కు అని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వారి విద్యా భవిష్యత్తుకు జీవనాడిగా నిలుస్తుంది అన్నారు.
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల కాకపోవడంతో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిందని, అనేక కుటుంబాలు అప్పులు చేసి పిల్లల చదువులు కొనసాగించే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థగా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీవ్రతను తీసుకెళ్లి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గుజ్జ సత్యం కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.






