3 September, 2026 | 1:43 AM

సీఎం కాకుండా నన్ను బ్రహ్మ కూడా ఆపలేడు

03-09-2026 | 12:15am
  1. కొత్త నాయకులు పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నరు
  2. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ‘ఆ సమయం వస్తే నేను సీఎం కావడాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని తన స్వగ్రామం బ్రాహ్మణవెళ్లంలలో బుధవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా  ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సమయంలో రాజగోపాల్‌రెడ్డి అనుచరులు, అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయగా..

ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైఎస్సార్‌ను తామంతా నిజమైన గురువుగా భావిస్తామని, ఆయన ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో మరోసారి వైఎస్సార్ పాలన తరహాలో ‘రాజన్న రాజ్యం’ రావాలని ఆకాంక్షించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న వైఎస్సార్ ఆలోచనలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులు కాంగ్రెస్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతామంటే ఊరుకోను’ అంటూ పరోక్షంగా వలస నాయకులను హెచ్చరించారు.

పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న నేతలు, కార్యకర్తల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి పనిచేసిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వబోనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. వారికి ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.