3 September, 2026 | 12:52 AM

‘మధుయాష్కీ’ నాయకత్వంపై నీలినీడలు?

03-09-2026 | 12:13am

ఇప్పటికే ‘టూరిస్ట్ లీడర్’ అనే నిందలు..? 

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నాయకుడు ‘ఎల్బీనగర్’ పంచాయితీ తీర్చలేడా? అని ప్రశ్నలు..

కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపై తీసుకురాలేని ‘ఇన్‌చార్జి’- నన్ను ఓడించారని.. మధుయాష్కీ ఒంటరి ప్రయాణం 

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్త్రంగా మారిన ‘కాంగ్రెస్ కీచులాటలు’

ఎల్బీనగర్, సెప్టెంబర్ 2: నాయకుడు... నాయకత్వం... అనేవి చిన్న పదాలుగా కనిపించినా... ఎంతో బరువైన బాధ్యతలు. చిన్న కుటుంబమైనా ఇంటి పెద్ద మార్గదర్శకం సరైనది అయితే... ఎంతటి కష్టాలున్నా.. ఇబ్బందులు ఉ న్నా.. సమన్వయంతో సమష్టిగా ఎదుర్కొంటారు. ఇదే సూత్రం అన్ని రంగాల్లో వర్తిస్తుంది.

నాయకుడు బలంగా ఉంటే శ్రేణులు అంతకంటే బలంగా ఉంటాయి. పార్టీ అధికారంలో ఉంటే స్థానిక నాయకులు ఎంత బలంగా ఉండా లి?... కానీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ’రాజకీయ భవిష్యత్తును స్వయంగా భూస్థాపితం చేసుకుంటున్నారు’ అనేది అతిశయోక్తి కాదు. ఇందుకు పక్కా నిదర్శనం ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు. - 

ఢిల్లీ లీడర్... గల్లీ పంచాయితీ తీర్చలేడా? 

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నాయకుడు అని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్(Madhu Yashki Goud) అని ఆయన అనుచరులు చెప్పుకుంటారు. అంతటి బలమైన నాయకుడు తన గుప్పిట్లో ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎంత బలంగా తీర్చిదిద్దాలి?. తాను పుట్టి పెరిగిన గడ్డ ఎల్బీనగర్ నియోజకవర్గం అని చెప్పుకునే మధుయాష్కీగౌడ్ తన పార్టీలో నెలకొన్న అనైక్యతను ఎందుకు పరిష్కరించలేదు? అని స్వయంగా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో వర్గ పోరుకు మధుయాష్కీ ఆజ్యం పోశారని... శాసనసభ ఎన్నికల్లో తన ఓటమికి కారణమని అనుమానిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక నాయకులను కట్టడి చేయలేని నాయకుడు... నాకు ముఖ్యమంత్రి అయ్యే హోదా ఉందని ఎలా చెప్పుకుంటారని ప్రతిపక్ష పార్టీల నాయకులు దెప్పి పోడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయితీలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చే మున్సిపల్ ఎన్నికలకు అస్త్రంగా మార్చుకుంటున్నారు. - 

ఓటమిపై గుణపాఠం నేర్వని వైనం 

గత శాసనసభ ఎన్నికల ముందు ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar Constituency)లో కాంగ్రెస్ పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉంటారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ తాను పుట్టిన గడ్డపై పోటీ చేస్తానని టికెట్ తెచ్చుకున్నారు. అయితే, వివిధ కారణాలతో సుధీర్ రెడ్డి రాజకీయ చాణక్యం ముందు ఆయన ఓడిపోయారు. తన ఓటమిపై సమీక్ష చేసుకుని స్వీయ దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాల్సిన మధుయాష్కీగౌడ్... సొంత పార్టీ నాయకుల కుట్రలతో ఓడిపోయానని నిర్ణయించుకున్నారు.

బీసీ నాయకుడిని, తెలంగాణ కోసం పోరాడానని చెప్పుకునే ఆయన.. తన ఓటమి తర్వాత మరింత బలంగా మారాల్సింది పోయి... నిస్పృహకు లోనయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనడానికి ఉమ్మడి వెళ్లాల్సిన ఆయన .. ఎవరినీ నమ్మకుండా సొంత వర్గాన్ని సృష్టించుకున్నారు. తాను వర్గంతో తప్పా... మిగతా వారితో మాట్లాడకుండా ఒంటరి ప్రయాణం చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల ముందు  కాంగ్రెస్ నాయకులు సొంత వర్గాన్ని సృష్టించుకున్నారు. రామ్మోహన్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గాలు ఉన్నాయి. 

సొంత వర్గంపై దృష్టి... 

కొన్ని డివిజన్లకే పరిమితం మధుయాష్కీగౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో తనకంటూ వర్గాలను సృష్టించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, చంపాపేట డివిజన్లలో ఇప్పటి వరకు పర్యటించలేదు. పార్టీ డివిజన్ అధ్యక్షుల నియామకంలో అనేక వివాదాలు ఉన్నాయి. డివిజన్ అధ్యక్షుడిగా ఉంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ రాదని లీకులు ఇచ్చారు. పార్టీపై పట్టు ఉంటే టికెట్ ఎట్లనైనా తెచ్చుకుంటా అనే వారు ఉన్నారు.

అనధికార హోదాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

ఆయన.. ఒక మాజీ ఎంపీ, అదికూడా నిజామాబాద్ నుంచి... గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా, అనధికార హోదాలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా భావిస్తూ హడావుడి చేస్తున్నారనే విమర్శలున్నాయి.

డివిజన్ పర్యటన అంటూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంపై కాంగ్రెస్ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. - చిలికి చిలికి గాలివానగా మారిన పంచాయితీలుకాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జిగా మధుయాష్కీగౌడ్ నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చి, బలమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎదుర్కొవాల్సి ఉన్న సమయంలో సొంత పార్టీ నాయకుల పంచాయితీలను తీర్చడం లేదు అనే అప్రదిష్ట కొని తెచ్చుకుంటున్నారు.

ఫ్లెక్సీలో ఫొటోలు పెట్టలేదనే వివాదం సస్పెండ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు దారి తీసింది. సొంత నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కేసుల వరకు వెళ్లారు. అయినా, ఆయన మౌనం వీడలేదని, పార్టీ శ్రేణులు వర్గాలుగా చీలి పోయినా.... ఒక్క మాట మాట్లాడలేదు అనేది నిష్టూర నిజం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల పంచాయితీలు అస్త్రంగా మారుతున్నాయి.