పాలమూరు నీళ్లపై రాజకీయ పోరు.. ప్రజల్లో కొత్త చర్చ
- వెలుగొండకు నికర జలాలా? వరద జలాలేనా?
- పాలమూరు రంగారెడ్డి పనులు ఎవరి హయాంలో ఎంత?
- బీఆర్‌ఎస్ ఆరోపణలు.. కాంగ్రెస్ ప్రతిసవాళ్లతో వేడెక్కిన వనపర్తి రాజకీయాలు
వనపర్తి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : వనపర్తి(Wanaparthy) రాజకీయాల్లో ఇప్పుడు నీళ్లే ప్రధాన అస్త్రంగా మారాయి. వెలుగొండ ప్రాజెక్టు(Velugonda project), కృష్ణా నికర జలాలు, పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Lift Irrigation Scheme), అంశాలపై వనపర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు(allegations), సవాళ్లు విసురుతుండటంతో అసలు పాలమూరు నీళ్ల కోసం ఎవరు ఏం చేశారు..? ఎవరి హయాంలో ఎంత పని జరిగింది..? అన్న చర్చ ప్రజల్లో మొదలైంది.
వెలుగొండపై బీఆర్‌ఎస్ ఆందోళన
జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Singireddy Niranjan Reddy), మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి సోమవారం సాగునీటి ప్రాజెక్టులపై వివరించారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా వరద జలాలు మాత్రమే వినియోగించాలన్న నిబంధన ఉందని, నికర జలాల వినియోగం తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందనే ఆందోళనను నిరంజన్రెడ్డి వ్యక్తం చేశారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా పనులు పూర్తి చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనుల్లో ఆశించిన పురోగతి లేదని ఆరోపించారు.
90 శాతం పనులు పూర్తయితే నీళ్లు ఎందుకు రాలేదు?
బీఆర్‌ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ కూడా ప్రతిసవాల్ విసురుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నప్పుడు, రైతులకు పూర్తిస్థాయిలో నీరు ఎందుకు అందలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పంపింగ్ వ్యవస్థలు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం పూర్తయితేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంటున్నారు. పనులు ఎంత శాతం పూర్తయ్యాయన్నది కాదు.. చివరికి ఎంత ఎకరాకు నీరు అందిందన్నదే అసలు ప్రశ్న అనే వాదనను కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తోంది.
వెలుగొండపై పదేళ్లలో ఏం చేశారు?
వెలుగొండ ప్రాజెక్టు విషయంలో గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని బుధవారం జిల్లా డిసిసి కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు . అధికారంలో ఉన్న సమయంలో చేయని పోరాటాన్ని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ మాత్రం తెలంగాణ నీటి హక్కుల రక్షణే ప్రధానమని, నికర జలాల అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తోంది.
లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చింది..!
నీటి రాజకీయాలు ప్రజల్లోకి వెళ్లడంతో ఇరు పార్టీల నేతలు కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వనపర్తి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంత నిధులు ఖర్చు చేశారు..? ఎంత పని పూర్తయింది..? ఎంత భూమికి నీరు అందింది..? ఇంకా ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి..? తెలంగాణ నీటి హక్కుల కోసం తీసుకున్న చర్యలేంటి..? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
* రాజకీయాలు కాదు.. పొలానికి నీరు ఎప్పుడు..?
ఒకవైపు తెలంగాణ నీళ్లను కాపాడాలి అంటూ బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్ధమవుతుండగా, మరోవైపు గత పదేళ్ల పాలనపై లెక్కలు చెప్పాలి అంటూ కాంగ్రెస్ ప్రతిసవాల్ విసురుతోంది. వెలుగొండ జలాల వివాదం.. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టు పురోగతి ఇవన్నీ ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.






