1 April, 2026 | 1:25 AM

పసుపు తడిసినా కొనాల్సిందే

01-04-2026 12:00 AM
  1. తూకంలో కోతలు విధించొద్దు
  2. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సిందే
  3. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు
  4. అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం 

హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): అకాల వర్షాల నేపథ్యంలో పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. బలమైన గాలులు, వర్షాల వల్ల తేమకు గురైన పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను నూతన సాంకేతికతలు, ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించేందుకు మంగళవారం ఏర్పాటు  చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

వర్షానికి తడిసిన పసుపును తూకంలో కోతలు విధించకుండా, ప్రభుత్వం నిర్ణయించిన మేలురకం ధరకే కొనుగోలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. తేమ శాతం లేదా కోతల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మార్కెట్ యార్డు సిబ్బందిపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గ్రామ స్థాయిలో నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

యూరియా యాప్ ద్వారా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైన మోతాదును రైతులు సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, నానో యూరియా, నానో డి.ఏ.పీ వినియోగం, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.