మూడేండ్లలో మూడు రూపాయలు రాలే
- చితికిపోతున్న సివిల్ కాంట్రాక్టర్లు
రాష్ట్రంలో రూ.25,000 కోట్ల బకాయిలు
కరీంనగర్ జిల్లాకు రూ.100కోట్లు పెండింగ్
ఏడాది క్రితం ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య
బిల్లుల చెల్లింపులో గత ప్రభుత్వం అలసత్వం
కొత్త సర్కారులో ఇప్పటికీ ఎదురుచూపులే
ఆందోళన బాటకు సిద్ధమవుతున్న గుత్తేదారులు
కరీంనగర్, జూన్16 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత మూడేండ్లుగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో సివిల్ కాంట్రాక్టర్ల బతుకులు అగమ్య గోచరంగా మారాయి. సుమారు రూ.10 లక్షల లోపు పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు కూడా మూడేండ్లుగా బిల్లులు రావడంలేదు. ఏడాది క్రితం బార నారాయణ అనే కాంట్రాక్టర్ బిల్లులు రాకపోవడంతో కలతచెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో అలసత్వం ప్రదర్శించగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బిల్లుల కోసం ఇప్పటి వరకు ఆశతో ఎదురు చూశారు. అయినా ప్రభుత్వం బిల్లుల చెల్లింపులపై ఊసెత్తకపోవడంతో లాభంలేదని భావించిన గుత్తేదారులు ఆందోళన బాటకు సిద్ధమవుతున్నారు. త్వరలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాలని సివిల్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కరీంనగర్‌లో ప్రకటించారు.
బిల్లుల కోసం ఎదురుచూపులే
కరీంనగర్ జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీతో పాటు ఇతర శాఖల్లోనూ చేపట్టిన పనుల బిల్లులకు మోక్షం కలుగడంలేదు. మూడేళ్లుగా బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్లు, అధికారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో భవనాలు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, తరగతి గదులు, ప్రహరీలతో పాటు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు పనులు పూర్తయినా బిల్లులు అందలేదు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి అధికారుల చుట్టూ బిల్లుల కోసం తిరుగుతున్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ, సంక్షేమశాఖకు సంబంధించి రూ.10 లక్షల లోపు పనులకు సంబంధించి సుమారు రూ.వంద కోట్ల బిల్లులు రావాల్సివుంది.
ఇందులో ఆర్‌అండ్‌బీకి సంబంధించినవి రూ.20 కోట్లు, పంచాయతీరాజ్ రూ.15కోట్లు, మున్సిపల్‌కు సంబంధించినవి రూ.65 కోట్లు రావలసి వుంది. కేవలం సివిల్ పనులు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు చేసే పనులకు సంబంధించిన బిల్లులే అధికంగా ఉన్నాయి. పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల్లోనే కాకుండా ఇతర శాఖల్లోనూ చేపట్టిన పలు అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. గత మూడేండ్లుగా బిల్లులు రాక అప్పుల పాలై ఉండగా, కొత్త పనులు చేపట్టేందుకు సివిల్ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.25 వేల కోట్లు బకాయి ఉండగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి రెండు వందల మందికి రూ.వందకోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
పెండింగ్ బిల్లులు చెల్లించి, ఆదుకోవాలి
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గత రెండేండ్లుగా సుమారు రూ.వంద కోట్ల వరకు అన్ని శాఖల పరిధిలో పెండింగ్ బిల్లులు రావాల్సివుంది. ఆర్‌అండ్‌బీ, పీఆర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో దాదాపు జనరల్ ఫండ్స్ రూ.15 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన మా గుత్తేదార్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, మమ్మల్ని ఆదుకోవాలి.
కొప్పుల అజయ్‌కుమార్, టీసీసీడబ్ల్యూఏ ముఖ్య సలహాదారుడు, కరీంనగర్
భవిష్యత్తులో పనులు చేయలేం
ప్రెసిడెంట్ తెలంగాణ సివిల్ కాంట్రా క్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్, కరీంనగర్ అన్ని శాఖల సివిల్ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో వున్న బిల్లులను చెల్లించాలి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. భవిష్యత్తులో కొత్త పనులు చేయలేని స్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి(ఫైనాన్స్ డిపార్టుమెంట్)ని కలిసి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతాం. అన్ని విభాగాల చీఫ్ ఇంజనీర్లను కలిసి భవిష్యత్తులో పనులు చేయలేమని వినతిపత్రాన్ని అందిస్తాం.
ఆకుల మోహన్‌రావు, వర్కింగ్






