18 August, 2026 | 1:27 AM

ప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి

18-08-2026 12:25 AM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఫిర్యాదుదారులు ఇచ్చిన ప్రతి పిటిషన్ ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశించారు. సోమవారం కురవి పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ గదులు, రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ముందుగా రిసెప్షన్ విభాగాన్ని పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల పిటిషన్లు, వాటి పరిష్కార స్థితి, పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, ఎలాంటి అనవసర జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులు, పిటిషన్లు, స్టేషన్కు సంబంధించిన సమాచారాన్ని సీసీ టి ఎన్ ఎస్ 2.0లో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి అప్డేట్ చేయాలని సూచించారు..

అనంతరం జనరల్ డైరీ, స్టేషన్ రికార్డులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, పాయింట్ బుక్స్ తదితరాలను పరిశీలించారు. అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి, పూర్తిస్థాయిలో నిర్వహించాలని కురవి ఎస్‌ఐ సతీష్కు సూచించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా,నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు.