18 August, 2026 | 1:00 AM

మండలాల్లో ప్రజావాణి షురూ

18-08-2026 12:16 AM

మహబూబాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి సోమవారం ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఇటీవల ఆర్డిఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలో గత సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బోనాల పండుగ సందర్భంగా సోమవారం సెలవు రావడంతో గత సోమవారం ప్రజావాణి నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని మండలాల్లో మండల స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల స్థాయి అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు.

అయితే ఆశించిన స్థాయిలో మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి ఫిర్యాదులు, దరఖాస్తులు రాలేదని చెబుతున్నారు. యధావిధిగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపినట్లు చెబుతున్నారు.

మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినప్పటికీ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, మళ్లీ మండల స్థాయిలోనే ప్రజావాణి లో సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందని కొందరు పేర్కొన్నారు. అయితే చాలా మండలాల్లో అధికారులు మాత్రం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణకు చర్యలు తీసుకున్నారు.

కొన్నిచోట్ల ప్రజలు మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ దరఖాస్తులను అధికారులకు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 110 మంది అధికారులకు ఫిర్యాదులు, దరఖాస్తులు ఇవ్వగా, 18 మండలాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కేవలం 302 ఫిర్యాదులు దరఖాస్తులు మాత్రమే ఇచ్చారు.