ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
సుల్తానాబాద్ కోర్టు జడ్జి దుర్గం గణేష్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు.మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రతిమ ఫౌండేషన్ చే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ను జడ్జి గణేష్ ప్రారంభించారు.
ప్రతిమ హాస్పిటల్ వైద్యులు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, కక్షిదారులుతో పాటు సుమారు 150 మందికి బిపి, షుగర్, ఇసీజీ, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని, ఆకు కూరలు, మిటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. రైస్ మిల్లుల ద్వారా వచ్చే కాలుష్యంతో రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వయసు మీరిన వారికి మితాహారం శ్రేయస్కరం అని అన్నారు. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.




