రాష్ట్రానికి బీఆర్‌ఎస్ అవసరం

10-05-2024 12:25:43 AM

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది గులాబీ పార్టీనే

కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలో వణుకు

బడేభాయ్, ఛోటాభాయ్ ప్రజలను మోసం చేస్తున్నారు

‘మీట్ ది ప్రెస్’లో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): కొట్లాడి సాధించుకున్న తెలంగాణ భవిష్యత్తు బీఆర్‌ఎస్ చేతుల్లో ఉందని, రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పార్టీ చారిత్రాత్మక అవసరమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో వణుకు పుట్టిందని, రోజురోజు కూ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో గురువారం పాల్గొ న్న ఆయన.. బడేభాయ్, ఛోటా భాయ్ అంటూ అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను తమిళనాడుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, కృష్ణా, గోదావరి జలాలపై ఇక్కడి ప్రజలకు ఉన్న హక్కుల ను కాపాడటం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నా రు. తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అక్కడివారిని ఎదుర్కొనలేక ఇక్కడి వారిని ఒప్పించలేక రైతుల్లో అయోమయం సృష్టిస్తున్నారని మండిపడ్డా రు. కేంద్రం నిధులిస్తే  గ్యారెంటీలను అమ లు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు బూటకమని, వాటిని అమలు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని అందులో పొందుపరిచిన విధంగా కేటాయింపులు ఉంటాయని, అటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ అంటూ రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేసిన మోదీ ఆ దిశగా ఎందుకు విచారణ జరిపించడంలేదని ప్రశ్నించారు. 

ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేకనే ట్యాపింగ్ వ్యవహ రం ముందు తీసుకొచ్చారని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీని కాంగ్రెస్ పాలనలో నిర్ణీత 3 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.