మీ పిల్లల చదువు బాధ్యత నాది!
భర్తను కోల్పోయిన మహిళకు మంత్రి కోమటిరెడ్డి భరోసా
ఆర్థిక సాయం అందజేయడంతో పాటు పిల్లలను చదివిస్తానని హామీ
యాదాద్రి భువనగిరి, మే 20 (విజయక్రాంతి): గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముగ్గురు పిల్లల బరువు బాధ్యత తల్లిపై పడింది. పేదరికంలో ఉన్న ఆ తల్లి తన పిల్లల్ని చదివించేందుకు పడుతున్న కష్టం చూసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చలించిపోయారు. పిల్లల విద్య పూర్తయ్యే వరకు తానే చదివిస్తానని భరోసా కల్పించి కన్నీరు తుడిచారు.. ఈ సంఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్లే.. భువనగిరి మండలం చందుపట్లలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మామ మృతి చెందడంతో దశదిన కర్మకు వెళ్లడానికి బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మార్గమధ్యంలో ముగ్గురు పిల్లలతో ఓ మహిళ ధీన స్థితిలో కనిపించారు. దీంతో ఆ మహిళను నీది ఏ ఊరు, సమస్య ఏమిటని మంత్రి అడగ్గా.. తనది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరె గూడెం, నా పేరు మమత, నా భర్త ఇటివలే గుండెపోటుతో మరణించాడని చెప్పింది.
ముగ్గురు పిల్లలను పోషించడం, చదివించడం కష్టమవుతోందని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె మాటలకు చలించిన ఆయన కుటుంబ పోషణకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా ముగ్గురి పిల్లలను చదివించే బాధ్యత తనదేనని చెప్పి భరోసా కల్పించారు. అనుకోని సాయం అందడంతో మహిళ తీవ్రభావోద్వేగానికి గురై ‘ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది. ప్రభుత్వ సాయం కోసం వస్తే, సొంతంగా తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేసింది.






