29 August, 2026 | 10:20 AM

అప్పుడు సర్దుబాటు.. ఇప్పుడు దిద్దుబాటు!

21-05-2024 01:41 AM

వివాదంలో గజ్వేల్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు

మల్లన్నసాగర్ ముంపు బాధితులు, ఇళ్ల లబ్ధిదారుల మధ్య సమస్య

కొలిక్కి తెచ్చేందుకు రెవెన్యూ,మున్సిపల్ అధికారుల ప్రయత్నాలు

స్థానికేతరులకు ఇళ్ల రిజిస్ట్రేషన్లపై తాజాగా సర్వే

గజ్వేల్, మే 20 (విజయక్రాంతి) : అప్పు డు చేసిన సర్దుబాటు.. ఇప్పుడు దిద్దుబాటకు దారితీసింది. గజ్వేల్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు.. అటు మల్లన్నసాగర్.. ఇటు లబ్ధిదారుల మధ్య వివాదస్పదంగా మారాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణభూతమవుతున్నాయి. దీంతో అధికారులు దిద్దుబాటుకు ఉపక్రమించారు. అసలు విషయంలోకి వెళితే... గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీ పరిధిలో పేదలకు డబుల్ బ్రెడూం ఇళ్లు నిర్మించారు.

అయితే, వాటిని నిరుపేదలకు కాకుండా మల్లన్నసాగర్ ముంపు బాధితులకు కేటాయించారు. మొత్తం 1100 ఇళ్లు నిర్మించగా, సగం వరకు ముంపు నిర్వాసితులే నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నిరుపే దలకు సదరు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించారు. అప్పటికే కొన్ని ఇళ్లలో ముంపు బాధితులు ఉండడం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది.

లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులు తమకు దక్కిన ఇళ్లను ఖాళీ చేయాలని కోరుతున్నా... తమకు పరిహారం అందేవరకూ వెళ్లమంటూ ముంపు బాధితులు భీష్మించుకుని ఉన్నారు. తాజాగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచోసుకోవడంతో అధికారులు స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు సోమవారం రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయా న్ని సందర్శించారు. ముంపు బాధితులను ఖాళీ చేయించే ప్రయత్నాలు సాగుతున్నా.. సమస్య ఇప్పుడప్పుడే తీరడం కష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

అన్యులకు  రిజిస్ట్రేషన్?

సోమవారం చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  కొంద రు లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లు  2021లోనే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారుల దృష్టికి రావడంతో అంతా అవాక్కయ్యారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి డ్రైవర్ పేరిట ఒక ఇల్లు ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. మరికొందరు కూడా అధికారులకు తెలిసిన వారో లేదా బినామీలో అయి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా డబుల్ బెడ్రూం ఇళ్ల వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.