ప్రాణాల మీదకు వచ్చిన అతివేగం..
ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు
సిరిసిల్ల, ఏప్రిల్ 27,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు శివారులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్లమ్మ ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ, ముందున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న భారీ బండరాయిని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు వారు వాహనం పై నుంచి ఎగిరి పడటంతో తలలు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారు ఇటీవలే ఎస్సెస్సీ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులని సమాచారం. వేసవి సెలవుల్లో బయటకు వెళ్లిన సమయంలో అతివేగం, ప్రమాదకర ఓవర్టేక్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.






