21 June, 2026 | 9:26 AM

కోలుకున్న రూపాయి విలువ

19-06-2024 12:05 AM
  • 12 పైసలు పెరిగిన కరెన్సీ

ముంబై, జూన్ 18: దేశీయ స్టాక్ మార్కె ట్ జోరందుకుని, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్ఠానికి చేరడంతో రూపాయి ఇటీవలి రికార్డు కనిష్ఠస్థాయి నుంచి  కోలుకుంటున్నది. మంగళ వారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపు 83.55 తో పోలిస్తే 12 పైసలు కోలుకుని 83.43 స్థాయి వద్ద ముగిసింది. గత వారం ప్రధమార్థంలో రూపాయి రికార్డు కనిష్ఠస్థాయి వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస ర్యాలీ జరపడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి నిధుల్ని పెట్టుబడి చేయడం రూపాయి రికవరీకి కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఫారెక్స్ మార్కెట్లో డాలర్లు విక్రయించడం కూడా రూపాయికి మద్దతునిచ్చినట్టు వారు వెల్లడించారు. అయితే అధిక క్రూడ్ ధరల కారణంగా దేశీయ కరెన్సీ పెరుగుదల పరిమితంగా ఉన్నదన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో యూఎస్ డాలర్/ఇండియన్ రూపీ పెయిర్ 83.10 శ్రేణి మధ్య కదలవచ్చని బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.12 శాతం బలపడి 105.06 సమీపంలో కదులుతున్నది. బ్రెంట్ క్రూడ్ ధర 84 డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నది.