13-12-2025 12:00:00 AM
యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు
సంస్థాన్ నారాయణపూర్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును వినియోగించుకొని సరైన నాయకుణ్ణి ఎన్నుకునే అవకాశం వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం సంస్థాన్ నారాయణపూర్ మండలకేంద్రంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. ముందుగా రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఓటర్ల అవగాహన చైతన్య సదస్సు(స్వీప్)లో భాగంగా నారాయణపూర్ మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 100 శాతం ఓటింగ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మద్యానికి, డబ్బులకు ప్రలోభాలకు లొంగక ప్రతిఒక్కరు స్వేచ్చగా ఓటును వేయాలని అన్నారు. తొలివిడత పోలింగ్ లో యాదాద్రి మొదటి స్థానంలో ఉందని మిగిలిన రెండు విడతలో కూడా అత్యధిక పోలింగ్ నమోదయ్యేలా చూడడం పౌరులుగా మన అందరి బాధ్యత అన్నారు.
యువజనులు, విద్యార్థులు తమ ఇండ్లలో తల్లిదండ్రులతో చర్చించి ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పిడి నాగిరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ ప్రమోద్ కుమార్,ఎస్త్స్ర జగన్, ఎంపీఓ నరసింహారావు, ఏపీఎం శ్రీదేవి, మహిళా సంఘాల సభ్యులు, ఆశావర్కర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.