9 March, 2026 | 8:15 AM

మహిళలకు 33 శాతం రిజర్వేషన్

07-03-2026 12:22 AM
  1. 2029 నుంచి చట్టసభల్లో చట్టం అమలు

మహిళలు ఇప్పటి నుంచే సిద్ధంకావాలి 

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందని, ఈ చట్టం 2029 నుంచి అమల్లోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ..

మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలోనే అమల్లోకి వస్తున్నందున మహిళలు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని సూచించారు. దేశం కోసం, ప్రజల కోసం మహిళలు ముందుకొస్తేనే రాజకీయాల్లో రాణిస్తారని, అందుకు తగినట్టుగా అవకాశాలు కూడా వస్తాయని తెలిపారు. మహిళల్లో కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుందని, అందుకు ప్రధాని మోదీ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

క్రికెట్‌లోనూ మహిళల జట్టు విజయం సాధించిందని, మిగతా క్రీడా రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. సుస్మస్వరాజ్  చేసిన సేవలు ఎవరు మర్చిపోరని తెలిపారు. నృత్యకారిణి దీపికారెడ్డి ప్రతిభను గుర్తించిన కేంద ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించిందని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.