అభివృద్ధి మాటున సహజ వనరుల దోపిడీ!
- యథేచ్ఛగా మట్టి తరలింపు
- మామూళ్ల మత్తులో అధికారులు
- యాష్‌పాండ్
- పనుల్లో అక్రమాలు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (విజయక్రాంతి): అభివృద్ధి పనుల పేరిట సహజ వనరుల దోపిడీ జోరుగా సాగుతున్నది. అనుమతులను మించి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారుల ఇవేవి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఏడో దశకు చెందిన రెండో యాష్‌పాండు అభివృద్ధి పనుల మాటున యథేచ్ఛగా మట్టి తర స్తున్నారు. పాల్వంచ మండల పరిధిలోని పుల్లాయిగూడెం సమీపంలో జరుగుతున్న ఈ అక్రమాలు రేయింబవళ్లు జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి తోలకం
జెన్‌కో యాజమాన్యం గత ఏడాది అక్టోబర్‌లో రూ.25 కోట్లతో బూడిదకట్ట (యాష్‌పాండు) అభివృద్ది పనులకు టెండర్ పిలిచింది. ఈ పనులను హైదరా బాద్‌కు చెందిన కావేరి కనస్ట్రక్షన్ కంపెనీ దక్కించుకొని పనులు చేపట్టింది. బుడిదకట్ట చుట్టూ మూడు కిలోమీటర్ల పొడవునా 5 అడుగుల మేర కట్టను పెంచాల్సి ఉంది. బూడిదచెరువు కట్ట పెంచాలంటే అందుకు మట్టి అవసరం ఉంటుంది. అవసరమైన మట్టిని వ్యవసాయ పొలాల్లో నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా తోలుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో టిప్పర్లతో, ప్రొక్లేన్ సహాయంతో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా భూమికి 20 అడుగుల తోతులో తవ్వుతున్నారు. మట్టి కోసం సమీపంలోని ఓ రైతు పొలంలో మట్టి తవ్వకానికి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. రైతు పొలంలో మట్టి తవ్వాలన్నా రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి. సంబంధిత రెండు శాఖల అధికారులు ఎవరూ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.
నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫీయా తరలిస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపట్ల సర్వత్రా విమర్ళలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా రైతుపొలంలో మట్టిని కేవలం రెండు, మూడు అడుగులు మాత్రమే తీయాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్ ఏకంగా 20 అడుగుల లోతులో తవ్వకాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు మట్టిని తవ్విన పక్కనే మరో రైతుకు చెందిన పొలం ఉంది. దాంట్లో బోరు మోటర్, కరంటు స్తంభం ప్రమాదకరంగా మారింది, అధిక వర్షాలు కురిస్తే మట్టి కొట్టుకుపోయి బోరు, కరెంటుస్తంభం కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తిలా పాపం తలా పిరికెడు అన్నట్టు.. అధికారులకు ఆమ్యాయ్యాలు సమర్పించి కాంట్రాక్టర్ తన పని తానుచేసుకుపోతున్నట్టు ఆరోపణలు బహిరంగంగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మట్టి రవాణపై విజిలెన్స్ అధికారులు దృష్టిసారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. మట్టి తవ్వకాలపై మైనింగ్ ఏడీ దినేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. గతంలో వచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్లను సీజ్‌చేసి రూ.50 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు. రూరల్ ఆర్‌ఐ హచ్చాను వివరణ కోరగా.. తాను ఎవరికి మట్టి తొలకాలకు అనుమతి ఇవ్వలేదని, అది మైనింగ్ డిపార్డుమెంటు పరిధిలో ఉంటుందని చెప్పడం గమనార్హం.






