17 July, 2026 | 9:44 PM

ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ కనుమరుగు

02-06-2024 02:21 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నిజామాబాద్, జూన్ 1(విజయక్రాంతి): జూన్ 4 తర్వాత తెలంగాణాలో బీఆర్‌ఎస్ కనుమరుగు కావడం ఖాయమని, మరో పదేళ్లు రేవంత్‌రెడ్డినే సీఎంగా ఉంటారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. నిజామాబాద్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. ప్రజలను గొర్రెలు, బర్రెలు, చేపపిల్లలు, ధరణి అంటూ పదేళ్లపాటు మోసం చేశారని విమర్శించారు.

లిక్కర్ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీసిందని మండిపడ్డారు. రాష్ట్రగీతంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాద్దాంతం చేయడం తగదని, ఫోన్ ట్యాపింగ్‌లో అందరు రావులే ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 13 స్థానాలు గెలవబోతుందని, బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదని స్పష్టంచేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు  పాల్గొన్నారు.