25 June, 2026 | 1:04 AM

‘ఔట్ సోర్సింగ్’కు బీమా వర్తింపు హర్షణీయం

25-06-2026 12:20 AM

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య

ముషీరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బారీ బీమా పథకాన్ని రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ హర్షం వ్యక్తం వ్యక్తం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, స్థానిక సంస్థల్లో వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వీరికి కూడా రూ.60 లక్షల వరకు బీమా రక్షణ కల్పించడం ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప భరోసానిస్తుందని జేఏసీ రాష్ట్ర చైర్మన్ పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిలు ధోయిపడి శ్రీధర్, దుర్గం శ్రీను లు అన్నారు. ఈ మేరకు బుధవారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలకు దూరంగా ఉండే పరిస్థితి గతంలో ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం వారిని కూడా ఈ బీమా పథకం పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఉద్యోగి అనుకోని ప్రమాదానికి గురైన సందర్భంలో కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకం సామాజిక భద్రతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సంబంధిత శాఖ మంత్రులకు,  అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి  ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.