ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం
కూకట్ పల్లి, జూన్ 24 (విజయక్రాంతి): కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే విజయం వరిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖామంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం కూకట్పల్లిలోని అనేవా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రతిభ కనబరిచిన 100 విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 15 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు అనేవా సంస్థ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయన్నారు.
రెండవ, మూడవ సంవత్సరం చదువుతున్న నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను సత్కరించడంతోపాటు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్స్ లర్ డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్టర్ డా. ఏ. జయలక్ష్మి, ప్రిన్సిపల్ డా. జి. వి. నరసింహారెడ్డి, ప్రిన్సిపల్ డా. వి. వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






