18 May, 2026 | 1:27 AM

మందుబాబులకు ఝలక్!

18-05-2026 12:20 AM

వీకెండ్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు 

భారీగా నమోదవుతున్న కేసులు

మేడ్చల్, మే 17 (విజయకాంతి): మందు బాబులకు మల్కాజ్గిరి పోలీసులు ఝలక్ ఇస్తున్నారు. వీకెండ్ లో ప్రత్యేక నిఘా పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడుతున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ముమ్మర ’డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీల్లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. వీరిని త్వరలోనే గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ద్విచక్ర వాహనదారులే ఎక్కువ

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. 261 మంది ద్విచక్ర వాహనదారులు, 22 మంది ఆటో డ్రైవర్ లు, 33 మంది నాలుగు చక్రాల వాహనాల డ్రైవర్లు, ఒకరు వారి వాహనం డ్రైవర్ పట్టబడ్డారు. రక్తంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పట్టుబడిన వారిని పోలీసులు వర్గీకరించారు. కొందరు ప్రమాదకర స్థాయిని దాటి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు తేలింది. 36 ఎం.జి నుంచి 200 ఎంజిలోపు 297 మంది, 201 ఎంజి నుంచి 300 ఎం.జి లోపు 22 మంది, 301 ఎంజి నుంచి 550 mg అత్యంత ప్రమాదకరస్థాయిలో నలుగురిని గుర్తించారు.

మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష

మద్యం మత్తులో వాహనాలు నడపడం క్షమించరాని నేరమని మల్కాజ్గిరి డీసీపీ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే.. వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 లోని సెక్షన్ 105 (హత్య కానేరని నేరపూరిత నరహత్య) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గత వారం  14 మందికి జైలు శిక్ష

మే 10 నుంచి మే 16 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో మొత్తం 194 కేసుల విచారణ పూర్తయింది. కోర్టులు నిందితులకు  శిక్షలు ఖరారు చేశాయి.జైలు శిక్ష , జరిమానా 14 మందికి,సామాజిక సేవ, జరిమానా ముగ్గురికి,కేవలం జరిమానా 177 మందికి విధించాయి. సమాజ రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, వాహనదారులు పోలీసులకు సహకరించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీసీపీ కోరారు.