ఉద్యోగాలపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు
నిరుద్యోగులకు అన్యాయం మీ పాలనలోనే..
అది సంగ్రామ సభ కాదు.. విద్రోహ సభ
ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, జులై 18 (విజయక్రాంతి): కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతను పూర్తిగా నిరాశపర్చారని, ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని పీసీసీ ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల కల్పనపై శ్రద్ధ చూపని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు సంగ్రామ సభ పేరుతో నిరుద్యోగుల గురించి మాట్లాడటం రాజకీయ నాటకమేనని విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేసిన నిరుద్యోగులపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్టులు చేసిందని, పేపర్ లీకుల ఘటనలతో వేలాది మంది యువత తీవ్రంగా నష్టపోయి, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయని సాయికుమార్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యం దక్కిందని, సాధారణ నిరుద్యోగ యువతకు న్యాయం జరగలేదని మెట్టు సాయికుమార్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే వాటిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నది సంగ్రామ సభ కాదని, నిరుద్యోగులను మోసం చేసిన విద్రోహ సభ అని వ్యాఖ్యానించిన ఆయన, పదేళ్లలో నిరుద్యోగ యువతకు చేసిన అన్యాయానికి బీఆర్‌ఎస్ నేతలు సభా వేదిక నుంచే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సాయికుమార్ డిమాండ్ చేశారు.






