సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలి
క్రైస్తవులపై దాడులను అరికట్టాలి
మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్ర రావు
ముషీరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ప్రార్థన స్థలాలు సమాజ శ్రేయస్సు కోసం సంకల్పాలు చేసే పవిత్ర వేదికలని మాజీ డీజీపీ జే. పూర్ణచంద్రరావు అన్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజీ చర్చిలో క్రిస్టియన్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్ (సీసీసీ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరణ, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడం, మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయడం వంటి అంశాలపై క్రైస్తవ సమాజం ఏకస్వరం వినిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికి రాజ్యాంగమే అత్యున్నత గ్రంథమని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయానికి పునాది అని పేర్కొన్నారు.రాజకీయ అవగాహన లేకుండా సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. క్రైస్తవ యువత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఓటు ప్రజల చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ ఆయుధమని, సమాజ ప్రయోజనాలను కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి దానిని చైతన్యంతో వినియోగించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విభజించే రాజకీయాలకు బదులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రైస్తవ తదితర అణగారిన వర్గాలు ఐక్యంగా నిలిచి రాజ్యాంగ విలువల ఆధారంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశానికి ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ మాజీ కాలేజీ ప్రిన్సిపాల్ జాన్ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ప్రిన్సిపాల్ వరకుమార్ , మాజీ ఐపీఎస్ అధికారులు జి. ఆల్ఫ్రెడ్, శ్రీ కె. బాబూరావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పరంజ్యోతి, బీసీ టైమ్స్ సంపాదకులు సంగెం సూర్యారావు, డేనియల్, అశోక్ కుమార్, ఇతర క్రైస్తవ నాయకులు హాజరయ్యారు. కాలేజీకి చెందిన అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.






