ప్రభుత్వ స్థలంపై కన్ను
రాత్రికి రాత్రే గది నిర్మాణం
మూడు పార్టీల నేతల కబ్జా బాగోతం
మేడ్చల్, జూన్ 8(విజయక్రాంతి): ఎక్కడైనా ఒక పార్టీ నాయకుడు భూముల కబ్జాలకు పాల్పడితే మరో పార్టీ నాయకులు ఫిర్యాదు చేయ డం, ఆ భూమిని రక్షించేందుకు పూనుకోవ డం చూస్తుంటాం. కానీ కుత్బుల్లాపూర్ మం డలం గాజులరామారంలో మాత్రం రాజకీయ నాయకుల పని చిత్రంగా ఉంది. మూడు పార్టీల నాయకులు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. అయితే, ఆ భూమి వైపు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. గాజులరామారం గ్రామంలోని సర్వే నంబర్ 13లో సుమారు 2 వేల గజాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. కొంత స్థలాన్ని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు, మరికొంత పార్కులు, క్రీడా ప్రాంగణాలకు కేటాయించారు. కొంత స్థలం లో గతంలోనే ఆక్రమణలు జరిగాయి. అయితే, స్థానికంగా ఉన్న కొన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కటై సదరు స్థలంపై కన్నేసి కబ్జా చేసేందుకు గతంలో యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారు లు కబ్జాను అడ్డుకున్నారు.
మారిన స్కెచ్..
అయితే, సదరు స్థలాన్ని అందరం కలిసి కబ్జా చేస్తే అడిగే వారే ఉండరని మూడు పార్టీలకు చెందిన నేతలు అనుకున్నారేమో. శుక్రవారం సాయంత్రం పనులు మొదలుపెట్టి శనివారం ఉదయం వరకు ఓ గదిని నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గజం స్థలం రూ.లక్షకు పైగా ధర పలుకుతోందని, రూ.2౦ కోట్ల విలువైన స్థలాన్ని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. ఆర్‌ఐ రజినీకాంత్‌ను వివరణ కోరగా.. సోమవారం కూల్చివేస్తామని స్పష్టం చేశారు.






