08-01-2026 12:27:05 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 7(విజయక్రాంతి): శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో గల కార్యనిర్వహక అధికారి కార్యాలయంలో జాతర మహోత్సవ నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి జిల్లా ఎస్.పి. నితిక పంత్, ఎ ఎస్. పి. చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31 వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రెబ్బెన నుండి గంగాపూర్ వరకు రహదారిపై దుమ్ము లేవకుండా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని, జాతరలో విద్యుత్ కోత లేకుండా విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
జాతరలో తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు భక్తుల సౌకర్యార్థం బస్సులు నడపాలని, జాతరకు వచ్చే భక్తులకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూర్యప్రకాష్, ఎంపీడీవో శంకరమ్మ, పంచాయితీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్, దేవాదాయ శాఖల అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.