రైతులను ఆదుకోవడంలో విఫలం
మునుగోడు 17 గ్రామాలకు సాగునీరు వెంటనే అందించాలి
7 ఆర్ మైనర్ కాల్వ పనులు ప్రారంభించాలి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, మార్చి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు ఇతర వర్గాలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాయి గానీ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. గురువారం మునుగోడు మండలం కలవలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీరు లేక బోరుబావులపై ఆధారపడి సాగుచేసిన పంటలు ఎండిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కలవలపల్లి గ్రామ సాగునీటికి కీలకమైన 7ఆర్ మైనర్ కాల్వ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాల్వ నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్ట్ప చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మునుగోడు ప్రాంతంలోని సుమా రు 17 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని పేర్కొంటూ బాధిత రైతులకు ఎకరానికి రూ.40 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ట్యాంకర్ నీటితో ఎండిన పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రైతుల పరిస్థితి బాధాకరమని తెలిపారు. తాను స్వయంగా వ్యవసాయం చేసిన అనుభవం ఉందని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎండిపోతే రైతుకు కలిగే బాధ ఎంతో తెలుసని గుర్తుచేశారు. బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు నుంచి కాల్వను కిష్టాపురం వరకు పొడిగించి మునుగోడు, నల్లగొండ మండలాల చెరువులను నింపాలని ఆయన కోరారు. ఇక్కడి నుంచి నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు నీటిని తరలించడం అన్యాయమన్నారు.
పులిపలపుల, కలవలపల్లి, కాశవారుగూడెం, బీరెల్లిగూడెం గ్రామాలకు తక్షణమే నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. 7ఆర్ కాల్వ నిర్మాణం కోసం కలవలపల్లి గ్రామం నుంచే 36 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు.ఇకనైనా పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, లేనిపక్షంలో 17 గ్రామాల రైతులను సమీకరించి సాగునీటి కోసం ఉద్యమం చేపడతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు.




