100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

02-05-2024 12:05:00 AM

ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం

విద్యార్థులను బయటకు పంపించిన యాజమాన్యాలు

ఎక్కడిక్కడ బాంబ్ స్కాడ్స్ ద్వారా తనిఖీలు

బెదిరింపులు బూటకమన్న కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ, మే 1: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎన్సీఆర్, ద్వారకా, చైతన్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్ ప్రాంతాల్లోని 100 స్కూళ్ల యాజమాన్యాలకు బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైన యాజమాన్యాలు, సిబ్బంది అప్పటికప్పుడు విద్యార్థులను బయటకు పంపించేశాయి. ఆందోళనకు గురైన వేలాది మంది తల్లిదండ్రులు స్కూళ్లకు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. 

అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు బాంబు స్కాడ్స్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో బెదిరింపు మెయిల్స్ బూటకమని కేంద్ర హోంశోఖ ప్రకటించింది. భయాందోళనలు సృష్టించిన నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. నిందితులు రష్యన్ నుంచి ఒకే మెయిల్ అడ్రస్ ద్వారా బెదిరింపు మెయిల్స్ పంపించినట్లు హోంశాఖ గుర్తించింది. బాంబు బెదిరిం పులపై తక్షణం విచారణ చేపడతామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, క్రైం బ్రాంచ్ కమిషనర్ రవీందర్ యాదవ్ చెప్పారు.