30 May, 2026 | 9:46 PM

Breaking News

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్

30-05-2026 09:02 PM

ప్రముఖ హోటల్ మేనేజర్‌ను బెదిరించి డబ్బులు దండుకున్న వ్యక్తి – కేసు నమోదు

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా చలామణి అవుతూ ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు దండుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం, కురకుల శ్రీనివాస్ (46), తండ్రి కే. నర్సింగ్ రావు, వృత్తి రీత్యా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, తాను ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నని చెప్పుకొని ఎస్సార్ నగర్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్‌కు వెళ్లాడు. హోటల్‌లో తనిఖీలు నిర్వహిస్తానని, అనుమతులు మరియు ఆహార నాణ్యతకు సంబంధించిన అంశాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హోటల్ మేనేజర్‌ను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో అధికార హోదాను దుర్వినియోగం చేస్తూ హోటల్ యాజమాన్యం నుంచి నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రభుత్వ అధికారి కాదని, నకిలీ గుర్తింపుతో ప్రజలను మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా వ్యవహరించే అధికారుల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు.