30 May, 2026 | 9:36 PM

పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్

30-05-2026 09:05 PM

- సీనియర్ అసిస్టెంట్ ని సర్వీస్ బుక్ లో నమోదు చేయమని బ్రతిమిలాడుతున్న కార్యదర్శి

- గరిడేపల్లి లో కొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు

- సీనియర్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి మధ్య వివాదం

- జూన్ ఒకటో తారీఖున సూర్యాపేట జడ్పీ ఆఫీస్ కి బదిలీ అవుతున్న సీనియర్ అసిస్టెంట్ మోహినుద్దీన్ 

- సీనియర్ అసిస్టెంట్ కారును వెల్లనివ్వకుండా అడ్డుకున్న కార్యదర్శి

- గత మూడు సంవత్సరాల నుంచి సర్వీస్ బుక్ లో ఎంట్రీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ఆవేదన

- కార్యదర్శి పై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య వివాదం చోటుచేసుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ను తన పని చేయకుండా వెళ్ళవద్దు అంటూ మండలంలో పనిచేస్తున్న ఒక పంచాయతీ కార్యదర్శి అడ్డుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ తన కారు ఎక్కి వెళ్తుండగా మండలంలో గిరిజన తండాలో పనిచేస్తున్న ఒక కార్యదర్శి అడ్డంగా నిలబడి అడ్డుకోవడంతో సదరు కార్యదర్శిని సీనియర్ అసిస్టెంట్ చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ తీవ్రంగా జరిగింది. అక్కడే ఉన్న సహ ఉద్యోగులు కొంతమంది గొడవను అడ్డుకున్నారు.

ఇదంతా  మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అందరూ చూస్తుండగానే జరిగింది. మండలంలోని ఒక గిరిజన తండాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి తన సర్వీస్ బుక్ లో మండలంలో తాళ్ల మల్కాపురం గ్రామపంచాయతీకి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ను, ఎంపీడీవో ఇచ్చిన జాయినింగ్ ఆర్డర్ ను, లక్ష తండా జాయినింగ్ ఆర్డర్ ను ఎంట్రీ చేయకుండా ఇబ్బందులకు  గురి చేస్తున్నారని  ఆరోపించారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు బ్రతిమిలాడిన, వేడుకున్నప్పటికీ నా సర్వీస్ బుక్ లో ఎంట్రీ చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ఆరోపించారు. సర్వీస్ బుక్ లో నమోదు చేసేందుకు లంచం అడిగాడని, ఆ డబ్బులు కూడా ఇస్తానని ఒప్పందం చేసుకున్నానని అయినా నా సర్వీస్ బుక్ లో వివరాలు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గరిడేపల్లి నుంచి జిల్లా పరిషత్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. దీంతో నా సర్వీస్ బుక్ లో వివరాలు నమోదు చేసి వెళ్లాలని సీనియర్ అసిస్టెంట్ వెళ్తున్న కారును మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కార్యదర్శి అడ్డుకున్నాడు. సర్వీస్ బుక్ లో వివరాలను నమోదు చేయకుండా ఉంటే భవిష్యత్తులో ప్రమోషన్లు సీనియారిటీ రాదని కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.కార్యాలయం నుంచి సీనియర్ అసిస్టెంట్ వెళ్తున్న కారుకు అడ్డంగా నిలబడి వెళ్ళనివ్వకుండా చేయడంతో సీనియర్ అసిస్టెంట్ కారు దిగి వచ్చి కార్యదర్శి పై చేయి చేసుకున్నాడు. సహ ఉద్యోగులు అందరూ వారిస్తున్నప్పటికీ గొడవ జరిగింది.

కార్యదర్శి పై చేయి చేసుకోవడంతో వివాదం పెద్దదిగా మారింది. ఇద్దరు ఉద్యోగులు కార్యాలయం ఆవరణలోనే కొట్టుకోవడం చూస్తున్న అక్కడ జనం ముక్కున వేలు వేసుకున్నారు. సమస్యను కార్యాలయం లోపల పరిష్కరించుకోవాల్సిన ఇద్దరు ఉద్యోగులు వీధిన పడి కొట్టుకోవడం ఏమిటని అక్కడ ఉన్న జనం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ అంతా తెలిసినవారే ఇలా కార్యాలయం ఆవరణలో అందరూ చూస్తుండగానే గొడవకు దిగడం విడ్డూరంగా ఉందని సంఘటన చూసిన జనం అనుకోవడం వినిపించింది. గరిడేపల్లి మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఉద్యోగస్తులు కార్యాలయం ఆవరణలో కొట్టుకోవడం మండలంలో సంచలనంగా మారింది.