సిద్దిపేటలో నకిలీ విత్తనాల మోసం
ఎనిమిది లక్షల పెట్టుబడి.. నష్టపోయిన రైతు
ప్రజావాణిలో ఫిర్యాదు.. న్యాయం చేయాలంటూ వేడుకోలు
నంగునూరు, జులై 15: సిద్దిపేట జిల్లాలో నకిలీ విత్తనాల ఉదంతం వెలుగులోకి వచ్చింది.బిఎఎస్‌ఎఫ్ కంపెనీకి చెందిన పవర్ అప్ టమాటా విత్తనాలను నమ్మి కొనుగోలు చేసిన ఒక రైతు, ఆశించిన దిగుబడి రాక, భారీగా నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన కత్తి రామస్వామి అనే రైతు తన మూడు ఎకరాల్లో బిఎఎస్‌ఎఫ్ కంపెనీకి చెందిన పవర్ అప్ రకం టమాటాను సాగు చేశారు.సదరు విక్రేతలు ఈ విత్తనాలు నంబర్ వన్ క్వాలిటీ అని,అధిక దిగుబడిని ఇస్తాయని నమ్మబలికారు.
పంట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, కూలీలు, మల్చింగ్, స్టేకింగ్,పందిరి కోసం కడీలు, గ్రీన్ మ్యాట్, సుతిలిదారం వంటి పనుల కోసం రైతు సుమరు రూ.8 లక్షల పెట్టుబడి పెట్టారు. అయితే, ఆ విత్తనాలు నాటిన తర్వాత పంట సరిగ్గా ఎదగకపోగా, పిందెలు కట్టకముందే పండిపోయాయని రైతు వాపోయారు. ఈ విత్తనాల వైఫల్యంపై సదరు కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా,వారు బాధ్యతా యుతమైన సమాధానం ఇవ్వకపోగా,సరికదా మీకు తోచిన పని చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారని రైతు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెట్టిన పెట్టుబడి అంతా వృథా కావ డంతో,ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రామస్వామి,న్యాయం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.గత 10 రోజులుగా రేపు వస్తాం, మాపు వస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని రైతు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా వ్యవసాయ శాఖాధికారులు, ఉద్యానవన శాఖాధికారులు స్పందించి, విచారణ చేపట్టి, బాధ్యులైన కంపెనీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం ఇప్పించాలని రైతు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.






