12-08-2025 07:01:11 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ప్రముఖ రచయిత్రి, ప్రజా రచయిత్రుల సంఘం ఆల్ ఇండియా అధ్యక్షురాలు అనిశెట్టి రజిత అంతిమ యాత్రలో సిపిఎం జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య(CPM District Leaders Chukkaiah) పాల్గొన్నారు. వారి మృతదేహాన్ని కెఎంసికి అవయవ దానం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, ఆమె రచనలు ప్రజలను చైతన్య పరిచేవని, రచయిత్రిగా అనిశెట్టి రజిత వందలాది కవితలు, ఉపన్యాసాలు చేశారని, సమసమాజ స్థాపనకోసం, మహిళలకు జరిగే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలపట్ల తనకలం, గళం విప్పేవారనీ, వారి మరణం ప్రజాస్వామ్యవాదులకు తీరనిలోటని, సిపిఎం జిల్లా కమిటీ తరఫున వారి మృతికి ప్రగాఢ సంతాపాన్నీ, కుటుంబానికి బందు మిత్రులకు సానుభూతిని చుక్కయ్య తెలిపారు.
రజిత మృతికి వరంగల్ ఎంపీ కావ్య సంతాపం
వరంగల్ ప్రజాస్వామ్యకరచరిత్ర వేదిక అధ్యక్షురాలు సాహితీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన అని శెట్టి రజిత మరణం పట్ల వరంగల్ ఎంపీ కడియం కావ్య తీవ్ర వ్యక్తం చేశారు. రచయిత్రిగా మాత్రమే కాకుండా సాంస్కృతిక ఉద్యమాల పట్ల అంకితభావం సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తెలుగు సాహితి లోకానికి సేవలందించిన రజిత మరణం సాహిత్య రంగానికి తీరని లోటని ఎంపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజిత కుటుంబ సభ్యులకు ఎంపీ కావ్య తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రజిత మృతి బాధాకరం
మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మంగళవారం రజిత భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలకంగా పని చేశారని అన్నారు. స్త్రీ సామాజిక సమానత్వం కోసం ప్రజల్లో, మహిళల్లో చైతన్య నింపారని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకురాలు రమాదేవి, మాజీ ప్రిన్సిపల్ బన్న ఐలయ్య, కేయూ ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.