13-08-2025 12:18:56 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, లేకపోయినా.. ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేటీఆర్ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వరద వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రభుత్వ వైఫల్యం వలన ఇబ్బందులు పడుతుండడం పైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు(BRS party leaders) శ్రేణులు సహాయక చర్యల్లో మరింత చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు ఆ మూడు జిల్లాల పార్టీ నేతలతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అండగా ఉంటుందని, అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.