calender_icon.png 13 August, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్లో వర్షం షురూ

13-08-2025 11:36:02 AM

హైదరాబాద్:  గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.అందుకు అనుగుణంగానే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో(Hyderabad Rain) బుధవారం ఉదయం వర్షం షురూ అయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్ పేట్, అమీర్ పేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, దుండిగల్, బాలానగర్, గండిమైసమ్మ, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడుపల్లి, కోఠి, అబిడ్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, పటాన్ చెరు, మణికొండ తదితర ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు నడపాలా, సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ముసీ పరివాహక ప్రాంతంతో పాటు ప్రమాద స్థాయికి నీరు చేరుకునే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియంత్రించాలని సీఎం సూచించారు.