29-07-2024 01:01:30 AM
నచ్చిన నంబర్ కోసం పోటీపడుతున్న వాహనదారులు
ఆర్డీఏకు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నంబర్లు
ఖైరతాబాద్ ఆర్టీఏలో ఇటీవల రూ.25లక్షలు పలికిన టీజీ 09 9999 నంబర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2౮ (విజయక్రాంతి): రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎంత హడావిడి ఉంటుందో మనందరికీ తెలిసిందే. దీనికి తోడు చాలామంది పౌరులు, వ్యాపార వేత్త లు, సినీ, రాజకీయ ప్రముఖులు తమ వాహనాలకు ప్రత్యేకత కలిగిన ఫ్యాన్సీ నం బర్లు రావాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా తాము నమ్మే విశ్వాసాలకు అనుగుణంగా లక్కీ నంబర్ల కోసం వెయింటింగ్ చేస్తుంటారు.
ఇప్పుడు ఆర్డీఏలో అంతా ఆన్‌లైన్ చేయడంతో.. ఔత్సాహికులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్ల కోసం వెయిటింగ్ చేసి బిడ్డింగ్‌లో సొంతం చేసుకోవడం తప్పా.. మరో మార్గం లేదు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ శాసన సభ్యుడు తాను కోలుగోలు చేసిన వాహనానికి అప్పటికే తనకున్న వాహనాలకు ఉన్న నంబరు కోసం దాదాపు రెండేళ్లు వెయిట్ చేశాడంటే ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోవాల్సిందే. ఫ్యాన్సీ నంబర్ల(లక్కీ నంబర్ల) కుండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
గతేడాది 1.84 లక్షల వాహనాలు...
హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పరిధిలో సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్), నార్త్ జోన్ (తిరుమలగిరి), ఈస్ట్ జోన్ (మలక్‌పేట), సౌత్ జోన్ (చంద్రాయణగుట్ట), వెస్ట్ జోన్ (టోలిచౌకి) ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో గత ఏడాది 2023 జనవరి నుంచి డిసెంబరు 31 నాటికి మొత్తం 1.84 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యా యి. వీటిలో ఖైరతాబాద్‌లో 60,473, మలక్‌పేటలో 25,544, తిరుమలగిరిలో 32,799, చాంద్రాయణగుట్టలో 33,877, టోలిచౌకిలో 31,838 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. 2024 జనవరి నుంచి జూలై 26వ తేదీ వరకూ ఖైరతాబాద్‌లో 33,647 వాహనాలు, మలక్‌పేటలో 14,374, తిరుమల గిరిలో 18,235, చాంద్రాయణగుట్టలో 21,421, టోలిచౌకిలో 19,192 వాహనాలు ఆయా ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయి. 2023లో మొత్తం 1,84,531 మంది వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఈ ఏడాది (2024) జూలై 26 దాకా దాదాపు సగానికి పైగా 1,06,869 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఆర్టీఏ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో మిగిలిన మరో 5 నెలల్లో గతేడాది వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్యను దాటే అవకావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫ్యాన్సీ నంబర్లదే అగ్రభాగం..
హైదరాబాద్ నగరంలోని 5 ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాల రిజిస్ట్రేషన్‌కు వసూలు చేసే ఫీజుల్లో ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాహనదారులు తమకు కావాల్సిన లక్కీ నంబర్లను రూ. లక్షలు వెచ్చించి మరీ బిడ్డింగ్‌లో పాల్గొంటారు. ఏ సిరీస్ అయినా ఫర్వాలేదు గానీ 9999 నంబర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో ఇటీవల కొత్త ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్‌కు బదులుగా టీజీగా మార్పు చేసింది. గడిచిన నెల (2024 వేసిన బిడ్డింగ్ ద్వారా ఓ వాహనదారుడు టీజీ 09 9999 నంబర్‌ను రూ.25 లక్షలకు సొంతం చేసుకు న్నాడు. ఇప్పటివరకు ఆర్టీఏలో అత్యధిక బిడ్డింగ్‌తో దక్కించుకున్న నంబరు ఇదే కావడం విశేషం.
జూలై 24వ తేదీన ఆరుగురు వాహనదారులు తమకు కావాల్సిన లక్కీ నంబర్లకు బిడ్డింగ్ వేయడం వల్ల ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఒకేరోజు రూ.51 లక్షల ఆదాయం సమకూరింది. 9999 నంబర్లతో పాటు 0001, 0009, 0005, 0006 నంబర్లకు బిడ్డింగ్‌లో భారీ ధర లభించే అవకాశాలున్నాయి. లేదంటే మరో బిడ్డింగ్ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. 2023లో మొత్తం 1,84,531 వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20.06 కోట్లు వసూలు కాగా, ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఆర్డీఏకు మరో రూ.25.81 కోట్ల ఆదాయం లభించింది. 2024లో ఇప్పటివరకు(జూలై 26) మొత్తం 1,06,869 వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.11.26 కోట్ల ఆదాయం రాగా, ఫ్యాన్సీ నంబర్ల రూపంలో మరో రూ.14.41 కోట్ల ఆదాయం లభించింది.