ఆర్థిక సంస్కర్తకు అల్విదా!
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తుది వీడ్కోలు
- ప్రభుత్వ లాంఛనాలతో నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు పూర్తి
- నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులు
- పాడె మోసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- స్మారక స్థలం కేటాయించేందుకు కేంద్రం సమ్మతి
మౌన మునికి భరతావని వీడ్కోలు పలికింది. అధికారిక లాంఛనాలతో శనివారం ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు కన్నీటి నివాళి అర్పించేందుకు మన దేశంలోని ప్రముఖులు మాత్రమే కాకుండా వివిధ దేశాల ప్రముఖులు కూడా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు స్మారక స్థలం కేటాయించనున్నట్లు తెలిపింది.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మన్మోహన్ అంతిమయాత్ర మొదలైంది. దారి పొడవునా ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే’ అనే నినాదాలు దద్దరిల్లాయి. అంతిమయాత్రలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నిగమ్‌బోధ్ ఘాట్‌కు చేరుకున్న తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్ది సేపు మన్మోహన్ సింగ్ పాడె మోశారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. మన్మోహన్ సింగ్ చితికి ఆయన కూతురు నిప్పంటించారు.






