30 July, 2026 | 7:52 AM

రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం

30-05-2026 09:57 PM

మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్

మహబూబ్ నగర్ టౌన్: రైతు డిస్కమ్ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ విమర్శించారు. రైతులు అడగకుండానే ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయం వ్యవసాయానికి ఎండ్రిన్ పోసినట్టేనని అన్నారు. రైతులకు మేలు చేసే నిర్ణయమైతే ప్రభుత్వం ఆరు నెలలుగా ఎందుకు గోప్యంగా ఉంచిందని ప్రశ్నించారు. డిస్కమ్‌లకు రూ.69 వేల కోట్ల బకాయిల్లో రూ.54 వేల కోట్లు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందని, ముందుగా ఆ బకాయిలు చెల్లించి ప్రస్తుతం ఉన్న డిస్కమ్‌లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

కొత్త రైతు డిస్కమ్ వల్ల రైతులకు ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని, సిబ్బంది కొరత కారణంగా విద్యుత్ సేవలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలోని 29 లక్షల వ్యవసాయ బోర్ల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్‌లు నిర్వహించాలని ఈఆర్సీని కోరారు. రైతుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతు డిస్కమ్‌లో తెలంగాణ ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలని, విద్యుత్ రంగంలో తెలంగాణ ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.