24 August, 2026 | 4:25 PM

పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన

22-05-2024 12:05 AM

తమ భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన

జనగామ, మే 21 (విజయక్రాంతి): తమ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, న్యాయం చేయకుంటే పురుగుల మందు తాగి చనిపోతానని ఓ రైతు అధికారులను హెచ్చరించాడు. తన తల్లితో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ధర్నాకు దిగాడు. జనగామ జిల్లా చిలుపూరుకు చెందిన బోళ్ల రాజుకుమార్ గ్రామ శివారులోని ఎకరా 24 గుంటల భూమిని తన భార్య స్వప్న పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. పట్టా పాస్‌బుక్ పెట్టి బ్యాంక్‌లో క్రాప్‌లోన్ కూడా తీసుకున్నాడు. కుటుంబ కలహాలతో స్వప్న భర్తకు దూరంగా ఉంటుంది. ఇదే అదనుగా భావించిన కొందరు ఆమె పేరుపై ఉన్న భూమిని అక్రమంగా మరొకరికి విక్రయించారని బాధితుడు వాపోయాడు. ఈ విషయం తనకు ఆలస్యంగా తెలియడంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశాడు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరి స్తానని తహసీల్దార్ సరస్వతి హామీ ఇవ్వడంతో బాధితుడు ఆందోళన విరమించాడు.