24 August, 2026 | 5:43 PM

మానేరులో ఇసుక తవ్వకాలు జరపొద్దు

22-05-2024 12:05 AM

తీర్పు వెలువరించిన ఎన్‌జీటీ

ప్రభుత్వానికి రూ.25 కోట్ల జరిమానా

కరీంనగర్, మే 21 (విజయక్రాంతి): మానేరు నదిలో డిసిల్టేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపడం తప్పేనని, తవ్వకాలు ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) మంగళవారం తీర్పు వెలువరించింది. టీఎస్‌ఎండీసీ, మైనింగ్ విభాగాలకు రూ. 25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాలు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు మూడు నెలల్లోగా చెల్లించా లని ఆదేశించింది. ఇసుక తవ్వకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకో వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించింది. నివేదికలు సమ ర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. మానేరు నదిపై జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై మానేరు పరివాహక ప్రాంతానికి చెందిన వారు రెండేళ్లపాటు చేపట్టిన ఆందోళనకు ఫలితం లభించినట్లయింది. మానేరు నదికి సంబంధించిన అంశంపై మొత్తం 5 పిటిషన్లు ఎన్‌జీటీలో నమోదయ్యాయి. గోదావరి ఉపనది అయిన మానేరులో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ముసుగులో అప్పటి ప్రభుత్వం డిసిల్టేషన్ పేరిట ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. టీఎస్‌ఎండీ ద్వారా టెండర్లను ఆహ్వానించి ఇసుక తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కిలోమీటర్‌కు ఒక రీచ్ చొప్పున ఇసుక తర లింపునకు అనుమతులిచ్చింది. గత ప్రభు త్వం చేసిన తప్పిదానికి ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీకి సిద్ధమవుతున్న తరుణంలో ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పు శాపంగా మారింది. మంగళవారం ఎన్‌జీటీ చెన్నై బెంచ్ ఇచ్చిన తీర్పుతో కరీంనగర్ జిల్లాలోని మానేరు నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తరలింపునకు బ్రేక్ పడినట్లయింది. గతంలోనే ఎన్‌జీటీ మానేరు నదిలో చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ రకరకాల పేర్లతో ఇసుక తర లింపు జరుపుతుండడంతో తాజా తీర్పుతో ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడినట్లయింది.