జవహర్ నగర్‌లో ఘోరం.. అల్లుని చేతిలో మామ హత్య
మామను హత్య చేసిన అల్లుడు
పీఎస్ లో ఫిర్యాదు చేసిన భార్య
జవహర్ నగర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): అల్లుని చేతిలో మామ హత్యకు గురైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని దొండ తోటకు చెందిన లింగనోళ్ళ అండాలు భర్త మొగిలి(44)తో కలసి నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు మొగిలి పొరుగు వారితో తరచుగా గొడవలు జరుగుతున్న కారణంగా గత పది సంవత్సరాల నుండి ఈ దంపతులు సాయిబాబా కాలనీలో నివసిస్తున్నారు.
ఈనెల 23వ తేదీన దొండతోటలోని తన పెద్ద కుమార్తె ఇంటికి బోనాల ఉత్సవాలకు రాగా ఆదివారం సాయంత్రం బయటికి వెళ్లి రాత్రి 8 గంటలకు ముఖంపై గాయాలతో మొగిలి తిరిగి వచ్చాడు. తర్వాత మొగిలి తన అల్లుడు శివతో గొడవకు దిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో జరిగిన వాగ్వివాదంలో మొగిలి అల్లుని ఇల్లుని ధ్వంసం చేసి విద్యుత్ వైరును తొలగించి శివకు చెందిన మోటార్ సైకిల్ ని కూడా ధ్వంసం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు శివ సుత్తితో మొగిలితలపై రెండుసార్లు బలంగా కొట్టగా మొగిలి స్పృహ కోల్పోగా శివ అక్కడ నుంచి పారిపోయాడు.
ఈ మేరకు మొగిలి భార్య 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మొగిలిని పరీక్షించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడని తెలిపారు. ఈ మేరకు తన భర్త మొగిలిని అల్లుడు శివ సుత్తితో తలపై కొట్టడం వల్లనే మృతి చెందాడని, భార్య అండాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తన భర్త మరణానికి కారణమైన శివ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






