8 April, 2026 | 2:28 AM

కొనుగోళ్లు ఎప్పుడు?

08-04-2026 12:54 AM

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం

వాతావరణం మార్పుతో అన్నదాతల ఆందోళన

మంగపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మండలంలో ధాన్యం పండించి కోత కోసిన అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. మండలంలోని పలు గ్రామాలలో గత పది, పదిహేను రోజుల నుండి వరి కోతలు మొదలయ్యాయి. వరి కోతలు మొదలై చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించి ఆరబోసుకున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం అన్నదాతలను ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది. మండలంలో దాదాపు 25 శాతం వరి పొలాలు కోతలు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటి వరకు మంగపేట మండలంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఊసే లేదు. దీనికి తోడు గత నాలుగు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులకు అన్నదాతలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, వర్షాలు పడే అవకాశాలు కనబడుతుండడంతో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతాంగం కోరుతుంది.

కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

మండలంలో పలు గ్రామాలలో గత పది, పదిహేను రోజుల నుండి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఆకాశం మబ్బుగా ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. వర్షం వస్తే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిచిపోయే అవకాశం ఉంది. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతుంది. మండలంలో ఒకటి, రెండు చోట్ల లాంఛనంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పత్రికలకు ప్రకటనలు ఇవ్వడమే తప్ప మండలంలో ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క బస్తా వడ్లను కూడా కొనలేదు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.

-వీరేన్ కుమార్, బీజీపీ మండల మాజీ అధ్యక్షులు