సింగరేణికి 30 ఏళ్ల భరోసా!
- నేడు, రేపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సింగరేణి భరోసా యాత్ర
- వేలం లేకుండానే సంస్థకు తాడిచర్ల2 బొగ్గు గని అప్పగింత
ప్రధాని మోదీని ఒప్పించడంలో కిషన్‌రెడ్డి సఫలం
రూ.64 వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టనున్న గని
ఒడిశాలోని నైనీ బ్లాక్ సంస్థకు దక్కడంలోనూ కేంద్ర మంత్రి ప్రత్యేక చొరవ
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): సింగరేణి చేతికి తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ దక్కడంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. గతంలో నైనీ బ్లాక్, ఇప్పుడు తాడిచర్ల కూడా దక్కడంతో కార్మికులు మరింత సంబురపడుతున్నారు. కార్మికుల ముఖాల్లో సంతోషానికి అవధుల్లేవు. రూ.54 వేల కోట్లకు పైగా బకాయిలున్న సింగరేణికి తాడిచర్ల బ్లాక్ దక్కడమనేది కార్మికులకు కేంద్రం భరోసా ఇవ్వడం లాంటిదే. ఇది సింగరేణికి దక్కడంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించడంలో ఆ శాఖ మంత్రి గా, అందులోనూ తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కృషిని మరువలేం. ఈ నేప థ్యంలోనే సింగరేణిని యూపీఏ ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తే మోదీ పాలనలో మహర్దశ మొదలైందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎలాంటి వేలం లేకుండానే తాడిచరేొ్ల2 సింగరేణికి దక్కింది. దీని ద్వారా 30 ఏళ్ల భరోసా సింగరేణికి దక్కడంతోపాటు రూ.64 వేల కోట్ల ఆదాయం సమకూర నున్నది. అంతేకాకుండా 1,200 ఉద్యోగాలు యువతకు దక్కనున్నాయి.
గనిని ఎలాంటి వేలం లేకుండా అప్పగించడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా లాభం చేకూరింది. సింగరేణికి బొగ్గు గనులను కేటాయించడం ద్వారా కార్మికులకు భరోసాను కేంద్రం కల్పించినట్టయింది. ఇందులో భాగంగానే కార్మికులకు నేరుగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సారథ్యంలో సింగరేణి భరోసా యాత్రను బీజేపీ చేపడుతున్నది. ఈ యాత్ర సోమ, మంగళవారాల్లో సాగనున్నది. సింగరేణి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రకటించారు.
కార్మికుల సమస్యలే పరిష్కారంగా..
ఈ యాత్ర ద్వారా సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది.. ఏం చేయబోతున్నదనే అంశాలను కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి కార్మికులకు వివరించనున్నారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించనున్నది. కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతోపాటు వారికి కేంద్రం తరఫున పూర్తి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర సింగరేణి వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాల గుండా సాగనున్నది. కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.
కార్మికులతో ముఖాముఖి.. గేట్ మీటింగ్‌లు
ఈ యాత్రలో కిషన్‌రెడ్డి ఐదు ముఖ్యమైన కేంద్రాల్లో కార్మికులతో నేరుగా ముఖాముఖి, గేట్ మీటింగులు, ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు. కార్మికులు తమ సమస్యలను నేరుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వేదికలు ఉపయోగపడనున్నాయి. తాడిచర్ల గనిని సింగరేణికి అప్పగించడాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ భరోసా యాత్రను బీజేపీ నాయకత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
ఈ యాత్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకత్వం, జిల్లాల నాయకత్వంతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణిలోని 41 వేల మంది శాశ్వత, 30 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మిక వర్గాల్లో భరోసా నింపడంతోపాటు సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఈ యాత్ర ద్వారా చాటిచెప్పనున్నారు.
పర్యటన వివరాలు ఇలా..
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ 10 నుంచి 12 గంటల వరకు హాల్‌మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మణుగూరుకు వెళ్తారు. మణుగూరు పీకే ఓసీౠ గనిని సందర్శించి, అక్కడే కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు భూపాలపల్లికి చేరుకుని, సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు హాల్ మీటింగ్‌లో పాల్గొంటారు.
రాత్రికి అక్కడే బసచేస్తారు. మంగళవారం ఉదయం 7 గంటలకు భూపాలపల్లి కేటీకే- గనిని సందర్శించి కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 9 గంటలకు తాడిచర్ల గనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రామగుండం చేరుకుని గోదావరిఖనిలోని జీడీకే-ఓసీ గని కార్మికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం మందమర్రి, శ్రీరాంపూర్ గనిని సందర్శించి, మధ్యాహ్నం 3.15 గంటలకు చెన్నూర్ నియోజకవర్గం కైతనపల్లిలో హాల్ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.






