13 July, 2026 | 2:54 AM

‘ఫీజు’ముడి వీడేనా?

13-07-2026 02:19 AM
  1. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
  2. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు

ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం

సర్టిఫికెట్లు ఆపొద్దన్న హైకోర్టు 

బకాయిలపై తేల్చాలంటున్న యాజమాన్యాలు ఆగస్టు 15 వరకు ప్రభుత్వానికి న్యాయస్థానం గడువు

కేవలం రూ.100 కోట్లు విడుదల

సంగారెడ్డి, జూలై 12 (విజయక్రాంతి): విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాల కలలు కంటున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య నలుగుతోంది. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన దాదాపు 10 వేల కోట్ల ఫీజు రీయిబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు జాప్యం చేస్తున్నాయి.

దీంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందు కు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తం గా విద్యార్థి లోకం నుంచి నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సర్టిఫికెట్లను ఆపొద్దని, తక్షణమే జారీ చేయాలని కళాశాలల యాజ మాన్యాలను ఆదేశించింది. అంతేకాక మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది.  

విడుదల చేసింది కొంతే..

మొదటి విడత రీయింబర్స్‌మెంట్ నిధులను ఆగస్టు 15 లోపు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కదిలిన సర్కార్, తక్షణ ఉపశమనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా ర్థుల కోసం రూ.100 కోట్లు విడుదల చేసింది. హైకోర్టు విధించిన మొదటి గడు వు ప్రకారం ఈనెల 31లోగా 2, 3, 4వ సంవత్సరాల విద్యార్థుల బకాయిలు, ఆగస్టు 15 లోపు మొదటి సంవత్సరం విద్యార్థుల బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయాలి. విడుదల చేసిన రూ.100 కోట్లు కాకుండా, పేరుకుపోయిన రూ.10,000 కోట్ల బకాయిల్లో ఒకేదఫాలో కనీసం రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు మంజూరు చేయాలి. 

అంతేకాకుండా డీబీటీ విధా నం, జీవో 7, 8, 9లపై గందరగోళాన్ని తొలగించి, నిధులను నేరుగా కళాశాలల ఖాతాల్లో పడేలా లేదా విద్యార్థులకు సకాలంలో అందేలా సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఫీజు బకాయిల నెపం తో ఏ ఒక్క విద్యార్థికి సర్టిఫికెట్లు ఆగకుం డా ప్రభుత్వం కాలేజీలకు లితపూర్వక భరోసా ఇవ్వాలి. ఇదిలా ఉండగా  ఆగస్టు 15లోగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే కళాశాలలు నేరుగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొనడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళనకు దారితీసింది.  

జీవోలు 7, 8, 9లపై రగడ..

ప్రభుత్వం తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానానికి సంబంధించిన జీవోలు 7, 8, 9 లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విధానం ప్రకారం నిధులు నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.  విద్యార్థులు వాటిని వారం రోజుల్లో కాలేజీలకు చెల్లించాలి. అయితే, 75 శాతం హాజరు లేని విద్యార్థులకు ఈ నిధులు రావని, ఆ భారాన్ని విద్యార్థులే భరించాలన్న నిబంధనను ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నిరసన తీవ్ర రూపం దాల్చింది.  ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.  జిల్లాలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, పారామెడికల్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండే సంగారెడ్డి, పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మెదక్‌లో ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్’ కింద చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను తరగతులకు అనుమతించడం లేదు. దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వాహనాన్ని అడ్డగించి నిరసనను వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 180కి పైగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. ఫీజు బకాయిల కారణంగా సర్టిఫికెట్‌లు అందని విద్యార్థుల సంఖ్య 45,000 పైమాటే. 

చెప్పినంత చెల్లిస్తేనే సర్టిఫికెట్‌లు..

ఉమ్మడి మెదక్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. అడిగినంత చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు భీష్మించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.