13 July, 2026 | 2:53 AM

సద్దుమణిగేనా?

13-07-2026 02:12 AM
  1. తుంగతుర్తి కాంగ్రెస్‌లో సయోధ్యకు అధిష్ఠానం ప్రయత్నాలు
  2. ఎమ్మెల్యే సామేల్‌తో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ
  3. మండల అధ్యక్షుల నియామకం, వర్గపోరుపై ఆరా
  4. పార్టీ కోసం కష్టపడిన వారినే నియమించానని ఎమ్మెల్యే స్పష్టీకరణ
  5. ఎంపీ వల్లే పంచాయితీ వచ్చిందని ఆరోపణలు
  6. త్వరలో అధిష్ఠానానికి నివేదిక : జగ్గారెడ్డి
  7. గాంధీభవన్‌కు భారీగా తరలివచ్చిన ఎమ్మెల్యే వర్గీయులు

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. మండల కమిటీల ఎంపికపై కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఆధిపత్య పోరును మరింత రాజేసింది. రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ పంచాయితీకి తెరదించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. పీసీసీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో గాంధీభవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంపై ఎమ్మె ల్యే వివరణ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు, సామాజిక న్యాయాన్ని పా టించామని, అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఎమ్మెల్యే సామేల్ వివరించినట్లు తెలిసింది. జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నాయకుల అభిప్రా యాలు సేకరించి.. జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య సిఫారసు మేరకు టీపీసీసీ అధ్యక్షుడికి పంపినట్లు జగ్గారెడ్డికి ఎమ్మె ల్యే వివరించారని సమాచారం. 

మండల అధ్యక్షులతో సమావేశం..

తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనంగా ఎంపికైన తొమ్మిది మండలాల అధ్య క్షులతోనూ జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెల కొన్న పరిస్థితులు, తాజా పరిణామాలపై వా రిని అడిగి తెలుసుకున్నారని తెలిసింది. ఇం దుకు సంబంధించి నివేదికను త్వరలో టీసీసీసీకి అందజేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. విభేదాలకు పోకుండా సంయమనం పాటించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు సూచించారు.

నియోజక వర్గ రాజకీయ పరిస్థితులపై పార్టీ అధ్యయనం చేస్తుందని, ఎవ్వ రూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. కాగా  ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులతోనూ జగ్గారెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి పార్టీ అధిష్ఠానానికి నివేదిక అందజేస్తానని జగ్గారెడ్డి చెప్పడంతో మండల కమిటీల వ్యవహారంపై పార్టీ స్థా యిలో మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.  

ఎమ్మెల్యేలకు మద్దతుగా తరలివచ్చిన కార్యకర్తలు..

ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మద్దతుగా ఆయన వర్గీయులు, సర్పంచ్‌లు, మండల పార్టీ నాయకులు భారీ సంఖ్యలో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఎమ్మెల్యేకు అనుకూ లంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవులు ఇచ్చారని, పార్టీలోని కొందరు ఓర్చుకోవడం లేదని వా రు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ భేటీలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పాల్గొన్నారు.

నా హక్కులు కాలరాస్తే తిరగబడతా: ఎమ్మెల్యే సామేల్  

తన హక్కులను కాలరాస్తే తిరగబడతానని ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చరించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవాళ్లకు పదవులు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కష్టపడ్డ వారినే పదవుల్లో నియమించినట్లు చెప్పారు. ‘కొత్తగా పదవుల్లో నియమించిన తొమ్మిది మందిని ఎవ్వరూ కదిలించలేరు’ అని ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలకు లేఖలు రాయడం వల్లనే ఈ పంచాయితీ మొదలైందని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం మొదటి అధికారం ఎమ్మెల్యేకు, ఆ తరువాత ఎంపీకి ఉంటుందన్నారు.

నాకు, ఎంపీ చామలకు ఎలాంటి గొడవలు లేవని, జోకులు కూడా వేసుకుంటామని తెలిపారు. చామలకు తుంగతుర్తిపై ఏమాత్రం అవగాహన లేదని, ఎమ్మెల్యే తనకు మద్దతు ఇచ్చారని, దీంతో ఆయన ఎంపీ అవ్వాలని తాను కోరుకున్నట్టు చెప్పారు.   ఎంపీతో తనకు విభేదాలు లేవని, ఆయన కొంతమంది మాటలు విని ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఎవ్వరి ప్రమేయం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలుస్తానని చెప్పారు. తాజా పరిణామాలను చక్కదిద్దుతానని ఏఐసీసీ, పీసీసీకి ఎమ్మెల్యే అప్పీల్ పెట్టుకున్నారు.