18 May, 2026 | 2:48 AM

రైతులకు ధోఖా

18-05-2026 01:40 AM
  1. కనీసం ధాన్యం కొనలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం 
  2. ధాన్యం సేకరణకు ప్రతి పైసా కేంద్రానిదే.. 
  3. ‘సర్’ మొదటిసారి జరగడం లేదు 
  4. కాంగ్రెస్ హయాంలో అనేకసార్లు చేపట్టారు 
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 17(విజయక్రాంతి): ‘కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది.. కనీసం ధాన్యం కొనలేని స్థితిలో ఉంది.. తన నిర్లక్ష్యాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తుం ది’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని,  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు బ్యాంకు ల్లో డీఫాల్టర్లుగా మారారని దుయ్యబట్టారు.

ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ధాన్యం సేకరణకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని, అయినా రైతు ల నుంచి వడ్లు పూర్తిస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని రాష్ట్రాన్ని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో వరికి మద్దతు ధర క్వింటాకు రూ.1,300 ఉండగా, మోదీ సర్కార్ రూ. 2,360కు పెంచిందన్నారు. ఎకరాకు కనీసం రూ. 6 వేలు లాభం చేకూరేలా పత్తికి కూడా మద్దతు ధరను క్వింటాకు రూ.8,660కు పెంచిందన్నారు.

తెలంగాణలో ఎక్కువగా పండే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభు త్వం ద్వారా కేంద్రం కొనుగోలు చేస్తే.. పత్తిని కేంద్రమే నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం10 పంటలకు బోనస్ ప్రకటించి కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తుందని, అందు లో కూడా సగం మంది రైతులకు చెల్లించడం లేదన్నారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారే తప్ప.. పరిష్కరిం చేందుకు శ్రద్ధ చూపడం లేదన్నారు. మంత్రులు హైదరాబాద్‌కే పరిమితమై ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్, వీడియో కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారని, క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని విమర్శించారు.    

సన్న బియ్యం పంపిణీలో 60 శాతం వాటా కేంద్రానిదే..

రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న సన్నబియ్యం పంపిణీలో 60 శాతం వాటా కేంద్రానిదేనని, ప్రతి కిలోకు రూ. 40 ఖర్చు చేస్తుందని మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రైతులను ఆదుకుంటూనే 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా ఇస్తుందని.. ఇది వాస్తవం కాదని రేవంత్‌రెడ్డి చెప్పగలరా? అని ఛాలెంజ్ చేశారు. ప్రపంచంలోనే భారత్ లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అమలు చేస్తున్నదని, మరే దేశంలో ఇలాంటి పథకం లేదన్నారు. అంతర్జాతీయంగా ఎరువు ల ధరలు పెరిగినా.. అనేక ఏళ్లుగా యూరియాపై ఒక్క రూపాయి పెంచలేదన్నారు. రైతులకు ఎంతో ప్రయోజనం కలిగే ఫసల్ బీమ యోజన పథకాన్ని గత బీఆర్‌ఎస్ సర్కా ర్ అమలు చేయకపోగా.. కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తుందని విమర్శించారు.  

సర్‌తో ఆందోళన చెందవద్దు..

ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) చేపట్టడం ఇప్పుడే మొదటిసారి కాదని, కాంగ్రెస్ హయాంలో పలుమార్లు జరిగిందని మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మృతి చెందిన, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగిస్తారని, దీనిపై ఆం దోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఒక ఓటు ఒక దగ్గరే ఉండాలి.. తాను బాంబులు వేస్తా.. బ్రహ్మాస్త్రం వేస్తా.. అని రాహుల్‌గాంధీ అప్ప ట్లో అన్నారని, ఆయన అన్నట్లుగానే డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నా రు.

అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి.. సర్‌లో ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని కోరారు. బూత్ లెవల్ ఆఫీసర్లపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులకు మతం పేరుతో రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మీ ఓట్లు తొలగిం చాలని చూస్తోందంటూ స్వయంగా సీఎం వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘ఓ బీఆర్‌ఎస్ లీడర్ ఇవాళ ఒక స్టేట్ మెంట్ ఇచ్చిండు.. కేంద్రం కుట్ర చేయాలని చూస్తోందని? ఆ కుట్ర ఏంటో బయటపెట్టాలన్నారు. ‘కేరళ, తమిళనాడులో ఎస్‌ఐఆర్ చేపడితే బాగా జరిగినట్లు లెక్క..

ఎం దుకంటే అక్కడ బీజేపీ గెలవలేదు కాబట్టి.. బెంగాల్‌లో జరిగితే.. అక్కడ పొరపాటుగా జరిగినట్లు.. ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి.. అదే ప్రచారం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది’ అని మండిపడ్డారు. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్లు ఉంటే వారి ఓట్లను కచ్చితంగా తీసేయాలని, భారతపౌరుడు కాకుండా ఎవరి పేరు ఓటరు లిస్ట్‌లో ఉన్నా..  వెతికి తొలగించాలని ఆయన కోరారు. బెంగాల్‌లో ఓట్లు తొలగిస్తే బంగ్లాదేశీయులకు బాధ ఎందుకు? అక్రమ బంగ్లాదేశీయుల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి నొప్పి ఎందుకు వస్తుందన్నారు. ఈసీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. సీఎంగా ప్రభుత్వ అధికారులను బెదిరించే ప్రయత్నం చేసినా ఊరుకోమన్నారు.

పెట్రోల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించరు

మోదీ విజ్ఞప్తితో అనేక రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించినా.. తెలంగాణ ప్రభు త్వం ఎందుకు తగ్గించలేదన్నారు. దేశంలోనే అత్యధికంగా  చమురుపై ట్యాక్స్ వేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, కేంద్రాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం వల్ల దాదాపు అన్ని దేశాలు పెట్రో ఉత్పత్తులపై 100 శాతం ధరలు పెంచాయని, దీన్ని అర్థం చేసుకోకుండా కేంద్రంపై విమర్శలు చేయడం విపక్షాలకు తగదని కిషన్‌రెడ్డి హితవు పలికారు.